చీరతో కట్టేసి.. కర్రతో చితక బాదీ.. భర్త హత్య కేసులో సంచలన నిజాలు వెలుగులోకి!
తనను, పిల్లలను భర్త వేధిస్తున్నాడని ఓ ఇల్లాలు.. కట్టుకున్న భర్తను చంపేసింది. మద్యం మత్తులో దారుణంగా ప్రవర్తించడంతో భరించలేక భర్తను కాటికి పంపినట్లు ఆమె పోలీసుల విచారణలో వెల్లడించింది. దీనిపై కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు భార్యను అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు..

హైదరాబాద్, ఆగస్ట్ 18: భర్తను హత్య చేసి, దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భార్యను మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
పీర్జాదిగూడకు చెందిన సత్యనారాయణ (51), సునీత దంపతులు. ఆగస్టు 6న రాత్రి విధులు ముగించుకుని సత్యనారాయణ మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. రోజువారీ పనులకు వెళ్లిన సునీత కూడా మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. సత్యనారాయణ మద్యం సేవించి ఇంటికి రావడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. భర్త ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహానికి గురైన సునీత.. మద్యం మత్తులో ఉన్న సత్యనారాయణ కాళ్లను చీరతో కట్టేసింది. అనంతరం సెంట్రింగ్ కర్రతో అతడి తలపై, శరీరంలోని ఇతర భాగాలపై దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన సత్యనారాయణ స్పృహ కోల్పోయాడు. అనంతరం సునీత తన కుమారుడికి ఫోన్ చేసి.. సత్యనారాయణ వాహనం నుంచి కిందపడిపోయినట్లు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు అతడిని తొలుత బోడుప్పల్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి 10.18 గంటలకు సత్యనారాయణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మొదట ఈ ఘటనను పోలీసులు రోడ్డు ప్రమాదంగా నమోదు చేశారు. అయితే దర్యాప్తులో భాగంగా అనుమానాస్పద అంశాలను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. సత్యనారాయణను అతడి భార్య సునీతే హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. తనను, పిల్లలను సత్యనారాయణ మానసికంగా, శారీరకంగా వేధించేవాడని.. ఆ కారణంగానే అతడిపై దాడి చేసినట్లు సునీత పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన మేడిపల్లి పోలీసులు సునీతను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆమెను రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




