అబ్బా.. ఏం స్కెచ్ వేశార్రా.. హాస్పిటల్‌కని వస్తే.. రూ.20వేలు కాజేసిన కేటుగాళ్లు! అసలేంజరిగిందంటే?
వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ సామాన్యుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారంతో నిలువునా దోచేశారు. సినిమా ఫక్కీలో ఒకరు చైన్ అమ్మేవాడిగా, మరొకరు కొనేవాడిగా నాటకమాడి బాధితుడికి రూ. 20 వేల కుచ్చుటోపీ పెట్టారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది.

హాస్పిటల్‌కని వచ్చిన ఓ వ్యక్తిని మోసం చేసి ఇద్దరు వ్యక్తులు అతడి వద్ద నుంచి రూ.20వేలు కాజేసిన ఘటన గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం పూనంనేనివారి పాలేనికి చెందిన బ్రహ్మయ్య అనే వ్యక్తి.. ఈ నెల 18న గుంటూరులోని ఓ ప్రముఖ స్కిన్ స్పెషలిస్ట్ వద్దకు చికిత్స నిమిత్తం వచ్చాడు. అయితే ఆసుపత్రిలో ఓపీ రద్దీ ఎక్కువగా ఉండటంతో బయటకు వచ్చి నిల్చున్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ అపరిచితుడు బ్రహ్మయ్యతో మాటలు కలిపాడు. కొద్దిసేపటికే మరో యువకుడు అక్కడికి వచ్చి, తనవద్ద రెండు బంగారు చైన్ ఉంతని కొంటారా? అని బ్రహ్మయ్యను అడిగాడు.. కానీ బ్రహ్మయ్యకు కొనే ఇంట్రెస్ట్ లేకపోవడంతో దాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
దీంతో మొదట బ్రహ్మయ్యతో మాటలు కలిపేందుకు వచ్చిన అపరిచితుడు తాను ఆ చైన్లను కొంటానంటూ రెండో వ్యక్తితో బేరసారాలు మొదలుపెట్టాడు. అంతా మాట్లాడుకున్న తర్వాత, తన వద్ద రూ. 20 వేలు తక్కువయ్యాయని.. ఆ డబ్బు ఇస్తే తాను ఇంటికెళ్లి తెచ్చిస్తానని బ్రహ్మయ్యను అడిగాడు. కానీ పరిచయం లేని వ్యక్తికి డబ్బులు ఎలా ఇస్తానని బ్రహ్మయ్య నిరాకరించాడు. అయితే బ్రహ్మయ్యను ఎలాగైనా బురిడీ కొట్టించాలని పథకం పన్నిన మొదటి వ్యక్తి.. వెంటనే ఆ యువకుడి వద్ద నుంచి బంగారు చైన్ తీసుకున్నాడు.
చైన్ ఇచ్చారు.. రూ.20వేలు కాజేశారు
దానిని బ్రహ్మయ్యకు ఇచ్చి.. లక్ష రూపాయల విలువైన ఈ చైన్ మీ వద్దే ఉంచుకోండి, నాకు రూ. 20 వేలు ఇవ్వండి. నేను ఇంటికి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చి, నా చైన్ నేను తీసుకెళ్తాను అని బ్రహ్మయ్యను నమ్మించాడు. చైన్ తన వద్దే ఉంటుందన్న ఆశతో బ్రహ్మయ్య తనవద్ద ఉన్న రూ. 20 వేలను ఆ అపరిచితుడికి ఇచ్చాడు. ఆ డబ్బును యువకుడికి ఇచ్చేయడంతో అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. అనంతరం, డబ్బులు తెస్తానని మరో యువకుడు కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నకిలీదని తేలడంతో పోలీసులకు ఫిర్యాదు
అయితే ఎంతసేపటికీ అతడు తిరిగి రాకపోవడంతో.. ఇద్దరూ ఒకే గ్యాంగ్ వారేనేమో అని అనుమానం వచ్చిన.. ఆ చైన్‌ను అసలు బంగారందా కాదా.. తెలుసుకునేందుకు వెంటనే దగ్గర్లోని ఓ బంగారం షాప్‌కు వెళ్లాడు.. అక్కడ తన దగ్గర ఉన్న చైన్‌ను చెక్ చేయించగా.. అది నకిలీదని తేలింది. దీంతో తాను మోసపోయానని, ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి తనను బురిడీ కొట్టించారని గ్రహించిన బాధితుడు వెంటనే కొత్తపేట పోలీసులను ఆశ్రయించాడు.
నిందితుల కోసం గాలింపు
ఇక బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇటీవల కాలంలో ఈ తరహా మోసం రికార్డుల్లో లేదని, ఇదొక కొత్త తరహా మోసమని పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అపరిచిత వ్యక్తులు తక్కువ ధరకు వస్తువులు ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
