Telangana: ఇదేదో సాధారణ బండరాయి అనుకుంటే మీరు పొరబడినట్లే..
ప్రాచీన చారిత్రక సంపద, వారసత్వ విశేషాలకు పుట్టినిల్లు ఉమ్మడి నల్లగొండ జిల్లా. కాకతీయ, బౌద్ధమత ఆనవాళ్లు.. చారిత్రక శిల్ప కళా సంపదకు నిలయంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉంది. ఈ ప్రాంతంలో రాతి యుగ కాలపు నాటి ఆనవాళ్లు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. ప్రాచీన మానవుడి అడుగు జాడలతో పాటుగా వేలాది సంవత్సరాల క్రితం రాతికొండపై చెక్కిన చిత్రకళ ఆనవాళ్లు తాజాగా వెలుగు చూశాయి. అవి ఎక్కడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ప్రాచీన చారిత్రక శిల్పకళా సంపదకు పెట్టింది పేరు ఉమ్మడి నల్లగొండ జిల్లా. నాటి కాలంలో అవసరాలు, పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కట్టడాలు అక్కడక్కడ నేటికీ దర్శనమిస్తుంటాయి. బౌద్ధమత, రాతి, మధ్య, ఇనుప యుగపు కాలపు నాటి ఆనవాళ్లు చరిత్రకు సజీవ సాక్షాలుగా ఉన్నాయి. ఆనాటి కాలపు అవసరాల కోసం నిర్మించుకున్న చెరువులు, నీటి బావులు, ఇళ్లు, సమాధులు వెలుగు చూస్తున్నాయి.
కొత్త రాతియుగపు రాతికళ..
నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం రామ లింగాలగూడెం దేవుని గుట్టపై కొత్త రాతి యుగపు మానవులు గీసిన చిత్రకళ ఆనవాళ్లను పురావస్తు పరిశోధకులు గుర్తించారు. శివాలయం పక్కనే ఉన్న దేవుని గుట్టను పరిశీలించి అక్కడి విశేషాలను తెలుసుకున్నారు. మూడు బండలపైన కొత్త రాతియుగపు మానవులు, వారు నిత్యం వాడుకునే రాతి పరికరాలతో ఎద్దులు, దుప్పులు, జింకలు, కుక్కలు, పులి ఇంకా నాటి మానవులు వేటాడే దృశ్యాల బొమ్మల్ని తీర్చిదిద్దినట్లు గుర్తించారు. ఈ రాతికళ క్రీస్తుపూర్వం 6000- 4000 సంవత్సరాల మధ్య కాలానికి చెందినదని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
గుట్టపై సహజంగా ఏర్పడిన నీటి దోనెలు, రాతి గొడ్డళ్లను అరగ తీసుకున్న ఆనవాళ్లు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. గుట్టపై సహజంగా ఏర్పడిన పెద్దపెద్ద బండల మాటున ఉన్న గుహలు, పాము పడగ ఆకారంలో గల రాతి చరియల కింద నాటి మానవులు నివసించేవారు. తీరిక సమయాల్లో తాము ఎదుర్కొన్న సంఘటనలు, చూసిన దృశ్యాలను కొత్త రాతియుగపు నాటి మానవులు చిత్రించారని శివనాగిరెడ్డి తెలిపారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ పురాతన రాతి కళను కాపాడి, భవిష్యత్తు తరాలకు తెలియ చేయాలని ఆయన గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు. నల్లగొండ జిల్లా చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలైన ఈ ఆనవాళ్లను కాపాడుకొని, చరిత్ర చిహ్నాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని శివనాగిరెడ్డి చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
