Telangana: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా 6,729 మంది ఉద్యోగుల తొలగింపు!
తెలంగాణలో అటెండర్ నుంచి ఐఏఎస్‌ల వరకు 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఓవైపు నిరుద్యోగులకు గ్రూప్1 నుంచి గ్రూప్4 వరకు ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరోవైపు సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కనున్నాయి.

తెలంగాణలో అటెండర్ నుంచి ఐఏఎస్‌ల వరకు 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ సర్కార్ నిర్ణయంతో ఓవైపు నిరుద్యోగులకు గ్రూప్1 నుంచి గ్రూప్4 వరకు ఉద్యోగ అవకాశాలు రానుండగా.. మరోవైపు సీనియర్ ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వుల ప్రభావం అటెండర్ స్థాయి నుంచి ఐఏఎస్ అధికారుల వరకు ఉండనుంది. ముఖ్యంగా మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, కన్సల్టెంట్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, ట్రాన్స్కో, జెన్‌కో డైరెక్టర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలాఖరుకల్లా తొలగింపు ప్రక్రియ పూర్తి కావాలని.. అవసరమైతే కొత్త నోటిఫికేషన్ జారీ చేసి మళ్లీ నియామకాల అవకాశాన్ని పరిశీలించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.
ఈ ఉత్తర్వులు అందిన వెంటనే మున్సిపల్ శాఖ 177 మంది ఉద్యోగులను వెంటనే తొలగించింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, హైదరాబాద్ వాటర్ వర్క్స్, మెట్రో రైల్, రెరా, మెప్మా, కుడా, వైటీడీఏ విభాగాలలోని ఉద్యోగులను కూడా తొలగించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డిప్యూటీ కలెక్టర్లు, అటవీ శాఖ అధికారులు, ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు వంటి అనేక స్థాయిల్లో ఉన్న ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇతర శాఖల్లో కూడా తొలగింపుల చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి.
విద్యుత్ శాఖలో మరికొందరు డైరెక్టర్లను తొలగించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖలో ఇప్పటికే 200 మందికి పైగా ఉద్యోగుల తొలగింపు జరిగింది. పోలీసు శాఖలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రావడంతో గతంలోనే తొలగింపులు జరిగాయి. రెవెన్యూ, దేవదాయ, ఆర్అండ్‌బీ, విద్యాశాఖ, బీసీ సంక్షేమం, రవాణా, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు వంటి కీలక విభాగాల్లో మరిన్ని మార్పులు ఉండవచ్చు.
ప్రభుత్వ చర్యతో ఉద్యోగ నియామకాల కోసం ఆరు వేలకుపైగా కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం గ్రూప్ వన్ నుంచి గ్రూప్ ఫోర్ వరకు కొత్త నోటిఫికేషన్లపై చర్చ జరుగుతోంది. కాంట్రాక్టుపై కొనసాగుతున్న కారణంగా పదోన్నతులు ఆలస్యమయ్యాయని ఉద్యోగ సంఘాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా ఉత్తర్వులతో ఉద్యోగులకు పదోన్నతుల అవకాశాలు విస్తరించనున్నాయి. ప్రభుత్వం పదవీ విరమణ అనంతరం కాంట్రాక్టుపై కొనసాగుతున్న 6729 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ అత్యవసరంగా 100 మందికి మాత్రమే తిరిగి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మెట్రో రైల్ ప్రాజెక్ట్‌కు ఎన్వీఎస్ రెడ్డికి తిరిగి అవకాశం ఇవ్వచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఖజానాపై భారం తగ్గనుంది. కాంట్రాక్టు ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు చేపట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. పదోన్నతులు నిలిచిపోవడంపై ఉద్యోగుల నుంచి వచ్చిన అసంతృప్తిని తొలగించేందుకు వీలయ్యే అవకాశం కూడా ఉంది. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను ఒక్కసారిగా తొలగించడంపై ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయం అటు ఉద్యోగ నియామకాలపై ఇటు రాజకీయ పరిణామాలపై దీర్ఘకాలంలో ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
మరిన్న తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..