Medak: ఆ ఊరిలోని యువత అంతా అప్పుల ఊబిలో చిక్కుకున్నారు.. భూతం అదే..
పట్టణాలకు పరిమితమైన బెట్టింగ్ భూతం పల్లెలకు పాకింది.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించొచ్చనే ఆశతో యువత బెట్టింగ్ వైపు అడుగులేస్తోంది. విద్యార్థులు, ఉద్యోగులు, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన యువకులు బెట్టింగ్ ఉచ్చులో పడి సంపాదించిన సొమ్మునంతా తగలేస్తున్నారు. ...

పచ్చని పల్లెల్లో ఆన్‌లైన్ గేమ్స్ చిచ్చు రేపుతున్నాయి…ఆన్‌లైన్ గేమ్ ఆడి లక్షలు పోగొట్టుకుంటున్నారు యువకులు. చివరికి చేసిన అప్పులు కట్టలేక పంట పొలాలు అమ్ముకొని బతుకు దెరువు కోసం వలస వెళ్తున్నారు ఆ గ్రామ యువకులు. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో యువత ఆన్‌లైన్ గేమ్స్‌కు అలవాటు పడి అప్పుల పాలవుతున్నారు. గత కొంతకాలంగా సుమారు 20 కుటుంబాల్లోని యువకులు ఆన్ లైన్ గేమ్స్‌కు అడిక్ట్ అయ్యి.. లక్షల రూపాయలు పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. ఫైనాన్స్ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టిన పంట పొలాలను, సొంత ఇళ్లను అమ్ముకొని వలస పోయారు. పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ యువత ఆన్‌లైన్ గేమ్ బారినపడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. గ్రామాలలో పనులు లేక యువత పెడదారిన పడుతున్నారని, సెల్ ఫోన్‌లకు బానిసలుగా మారి కూలీ పనులు దొరకక ఈజీ మనీ కోసం అలవాటు పడి లక్షలు పోగొట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు. చాలా కుటుంబాలు గ్రామాన్ని విడిచి పట్టణాలకు వలస వెళ్లారని, ఉన్న ఆస్తులు అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి.. తమ ఊరిని బాగు చేయాలని గ్రామ పెద్దలు కోరుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
