దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిజామాబాద్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న సరళకు అరుదైన గౌరవం దక్కింది. సిటిజన్స్ గాలెంట్ వారియర్ అవార్డు-2023 అందుకున్నారు. న్యూఢిల్లీలో గురువారం (మే 11) నాడు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డులతోపాటు రూ.50,000 నగదు బహుమతి అంతుకున్నారు. రైలు ప్రయాణికులను రక్షించడంలో ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుకుగానూ ఈ అవార్డు దక్కింది.
గతేడాది మార్చి 9న దేవగిరి ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి దిగడానికి ప్రయత్నిస్తుండగా ఓ మహిళా ప్రయాణికురాలు బ్యాలెన్స్ తప్పి ప్లాట్‌ఫారమ్ మధ్య ఉన్న గ్యాప్‌లో పడిపోయింది. అక్కడే విధులు నిర్వహిస్తోన్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సరళ వెంటనే అప్రమత్తమై ఆమెను ప్లాట్‌ఫారమ్‌పైకి లాగింది. దీంతో ప్రయాణికురాలికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. అలాగే.. గతేడాది సెప్టెంబర్ 19న నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు నుంచి దిగేందుకు ప్రయత్నించి ప్లాట్‌ఫారమ్‌కు, నడుస్తున్న రైలుకు మధ్య ఉన్న గ్యాప్‌లో మరో మహిళ పడిపోయింది. అప్పుడు కూడా సరళ మెరుపువేగంతో స్పందించి ఆమెను రక్షించింది. విధి నిర్వహణలో సరళ చూపిన ధైర్యసాహసాలు, సమయస్పూర్తి కారణంగా ఇద్దరు మహిళా ప్రయాణికుల ప్రాణాలు కాపాడినందుకు ప్రతిష్టాత్మకమైన సిటిజన్స్ గాలంట్ వారియర్ అవార్డుకు ఎంపికైంది.
ఈ సందర్బంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కానిస్టేబుల్ సరళను అభినందించారు. విధినిర్వహణలో సమయస్ఫూర్తితో వ్యవహరించి రైలు ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన తీరును ప్రశంసించారు. ప్రతిష్టాత్మక అవార్డు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ చేతుల మీదుగా అందుకోవడం గర్వకారణమని ఆయన అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.