AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సూసైడ్ స్పాట్‌గా మారిన ఆ ప్రాంతం.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య! ఎక్కడంటే

ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, చదువులో ఒత్తిడి.. కారణం ఏదైతేనేం చాలా మంది చావునే పరిష్కారంగా భావిస్తున్నారు. దీంతో ఆత్మహత్య చేసుకునేందుకు తెగబడుతున్నారు. వీరంతా తెలంగాణలోని ఈ ప్రాంతానికి తరలివచ్చి తనువు చాలిస్తున్నారు. ఇలా ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు ఈ ప్రాంతంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Telangana: సూసైడ్ స్పాట్‌గా మారిన ఆ ప్రాంతం.. ఈ ఏడాది ఏకంగా 22 మంది ఆత్మహత్య! ఎక్కడంటే
Basar Suicide Spot
Naresh Gollana
| Edited By: |

Updated on: Dec 19, 2024 | 2:29 PM

Share

బాసర, డిసెంబర్‌ 19: ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు, మానసిక వేదింపులు, క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు.. ఒక్కటేమిటి అన్నింటికి‌ శాశ్వత పరిష్కారం ఆ చోటే అన్నట్టుగా మారింది అక్కడి గోదావరి బ్రిడ్జ్. ఏ కష్టమొచ్చినా ఏ నష్టమొచ్చినా ప్రాణాలు తీసుకోవాలన్న ఆలోచన రావడమే ఆలస్యం ఆ వంతెన వద్దకు వెళ్లడం.. క్షణాల్లో ప్రాణాలు తీసుకోవడం.. అంతలోనే విషాద వార్తలు వినాల్సి రావడం. ఇది నిజామాబాద్ నిర్మల్ జిల్లాల సరిహద్దు బాసర గోదావరి వద్ద పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు ఏడాదికి పదుల సంఖ్యలో ఆత్మహత్యలు , వందల సంఖ్యలో ఆత్మహత్య యత్నాలు అన్నట్టుగా మారి.. ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. అలాంటి సూసైడ్ స్పాట్‌ను‌ రక్షణ వలయంలోకి తీసుకొచ్చి ఆత్మహత్యలకు చెక్ పెట్టేందుకు రెడీ అయ్యారు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల. సరిహద్దు జిల్లా‌ పోలీసుల సమన్వయంతో ఈ సూసైడ్ స్పాట్‌ను సేపెస్ట్ ఏరియాగా మలిచేందుకు రంగంలోకి దిగారు. జ్ఞాన సరస్వతి కొలువైన బాసరలో భవిష్యత్తుపై నమ్మకం పెరిగేలా నిర్ణయాలు ఉండాలి కానీ చావు‌కేకలు వినిపించకూడదని ఫిక్స్ అయిన నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలా.. వంతెన వద్ద ఆ దిశగా ఏర్పాట్లు చేసేందుకు పూనుకున్నారు.

గతంలోకి వెళితే.. నిర్మల్-నిజామాబాద్ జిల్లాల మధ్య బాసర వద్ద ఉన్న గోదావరి నది ఈ రెండు జిల్లాల వాసులతో పాటు పొరుగునే ఉన్న మహారాష్ట్ర వాసుల ఆత్మహత్యలకు వేదికగా మారింది. గత ఐదేళ్లలలో 108 మంది ఆత్మహత్య‌చేసుకోగా.. 86 మంది ఆత్మహత్య యత్నాన్ని స్థానికులు అడ్డుకున్న పరిస్థితి. నిర్మల్ జిల్లా వైపు బాసర గ్రామం ఉండగా.. నిజామాబాద్ జిల్లా వైపు యంచ గ్రామం ఉంది. ఎక్కువగా నిజామాబాద్ జిల్లా వాసులే ఈ వంతెన వద్ద ఆత్మహత్య చేసుకోగా.. మహారాష్ట్ర నాందెడ్ జిల్లా వాసులు సైతం తనువు చాలించేందుకు ఈ పవిత్ర గోదావరి అడ్డాగా మలుచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ ఏడాదిలో బాసర వైపు 12 , యంచ వైపు 10 ఆత్మహత్యలు నమోదవగా.. మరో 14 మందిని స్థానికులు‌ కాపాడారు.

వరుస బలవన్మరణాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈ వంతెన‌ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని.. బలవన్మరణాలను‌ ఆపాలని‌రెండు జిల్లాల వాసులు గతం నుండే డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వాలు‌, అధకారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఓ కుటుంబం అప్పుల బాధతో కుటుంబ సమేతంగాఇదే వంతెన పై నుండి గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోగా.. ఈ విషయం తెలుసుకున్న నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల చలించిపోయారు. ఆత్మహత్యలకు‌ అడ్డుకట్ట వేయాలని నిర్ణయం తీసుకున్న ఎస్పీ.. నిజామాబాద్ పోలీసులతో పాటు ప్రభుత్వ సహకారం, స్థానికుల సహకారం కోరారు. ఇందులో భాగంగానే బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్, ముధోల్ సీఐ మల్లేష్, ఎస్ఐ గణేష్ తో కలిసి బాసర గోదావరి బ్రిడ్జిని పరిశీలించారు. స్థానిక‌ గంగపుత్రులు, స్థానిక యువకులతో మాట్లాడారు. నది వద్ద పోలీస్ ఔట్ పోస్టు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని తెలిపారు. ఇప్పటికే వందలాది మంది‌ప్రాణాలు కాపాడిన మీరు (గంగ పుత్రులు, స్థానిక యువత) మరింత ముమ్మరంగా సేవలు అందించాలని, అందుకు ప్రభుత్వ సాయం ఉంటుందని తెలిపారు. ఇరు జిల్లాల సరిహద్దుల్లో వంతెనపై సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి సమీప పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేస్తామని.. వంతెనపై ముమ్మరంగా గస్తీ చేయించి ఆత్మహత్యల నివారణకు ప్రయత్నం చేస్తామని ఎస్పీ‌ జానకి షర్మిల తెలిపారు.

వంతెనకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడలకు ఎత్తయిన కంచె ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని.. వంతెన వద్ద లేక్ పోలీసు అవుట్ పోస్టు ఏర్పాటు చేస్తామని.. రాత్రి వేళల్లో కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఆత్మహత్యల నివారణకు వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఇక మీదట బాసర గోదావరి వంతెన అనగానే రక్షణకు కేరాఫ్ అడ్రస్ అన్న పేరు వినిపించాలేతప్ప ఆత్మహత్యలకు కాదని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.