Telangana: సాగర్ నుంచి శ్రీశైలం వరకు పడవ ప్రయాణం.. టికెట్ ధరలు ఇలా..
పరవళ్లు తొక్కే కృష్ణమ్మపై పడవలో ప్రయాణం. ఆ ఊహా ఎంతో థ్రిల్లింగ్ ఉంది కదా.! నిజంగా ఆ అనుభూతిని పొందే అవకాశాన్ని కల్పిస్తోంది తెలంగాణ టూరిజం. గలగల పారే కృష్ణమ్మ ఓ వైపు.. పచ్చని చీర కట్టుకున్న నల్లమల అడవి అందాలు మరోవైపు.. ఇలా అందాల మధ్య ఎంతో ఆహ్లాదంగా సాగే ఆ జర్నీలో ఎన్నెన్నో విశేషాలున్నాయి. సాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే ప్రయాణంలో మరుపురాని మధురానుభుతి సొంతమవుతోంది.
నాగార్జున సాగర్ – శ్రీశైలం ప్రయాణం ఎన్నో మధురానుభూతుల సమ్మేళనం. పచ్చని కొండల మధ్యలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ ప్రవాహం.. నదీజలాల మీదుగా వచ్చే చల్లని పిల్లగాలులు. చుట్టూ దట్టమైన నల్లమల అడవులు. పక్షుల కిలకిలరావాలు. ఇలా కృష్ణమ్మ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఈ ప్రయాణం సాగుతోంది.
నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు వెళ్లే టూర్ ప్యాకేజీ తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. నాగార్జునసాగర్ లాంచీ స్టేషన్ నుంచి తొలిరోజు 40 మంది పర్యాటకులతో లాంచీ కదిలింది. ఎక్కువ మంది పర్యాటకులు ప్రయాణించేలా డబుల్ డెక్కర్ తరహాలో ఏసీ లాంచీని ఏర్పాటు చేశారు. ఈ లాంచీ ప్రయాణం సింగిల్ వేకు పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా నిర్ణయించారు. రౌండప్ టూర్ ప్యాకేజీ అయితే పెద్దలకు రూ. 3000, పిల్లలకు రూ. 2400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీతో సాగర్ నుంచి శ్రీశైలం, శ్రీశైలం నుంచి సాగర్ వరకు లాంచీలో ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్రయాణంలో పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టూరిజం శాఖ లైఫ్ జాకెట్లు, మంచినీటి వసతి, ఆహార ఏర్పాట్లతో పాటు అన్ని రకాల జాగ్రత్తలను తీసుకుంటుంది. కృష్ణమ్మ సవ్వడుల మధ్య సాగే ఈ ప్రయాణంలో చాకలిగట్టు సమీపించగానే జింకలు, దుప్పులు కనువిందు చేస్తాయి. వాటిని చూసి పర్యాటకులు సంబర పడిపోతున్నారు.
ఇక గౌతమ బుద్ధుడి చారిత్రాత్మక విశేషాలను, జీవిత గాథలను తెలిపే నాగార్జునకొండ సమీపంగా సాగుతూ కొద్ది ప్రయాణంలోనే పురాతన ఏలేశ్వర గట్టు దర్శనమిస్తుంది. ఈ ప్రయాణంలో చారిత్రక కోటలు, కొండలు, జలపాతాలు కనిపిస్తాయి. అలా ముందుకు వెళ్లే కొద్దీ చూడ ముచ్చటైన అందాలు కనివిందు చేస్తూనే ఉంటాయి.
ఇక సాగర్ నుండి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్లు లాంచీ ప్రయాణానికి క్రూయిజ్ కెప్టెన్లు కీలకంగా ఉంటారు. లాంచీలో పర్యాటకుల భద్రతకు పెద్ద పీట వేస్తున్నారు. లాంచీలో ప్రయాణికులకు లైఫ్ జాకెట్లు ఇవ్వడంతోపాటు ఇద్దరు కెప్టెన్లు, నలుగురు స్విమ్మర్లు ఉంటారు.
అక్క మహాదేవి గుహలు ఆధ్యాత్మికతకు చిహ్నాలు.. ఆ అందాలను దాటుకుంటూ ముందుకు వెళ్తుంది ఈ బోటు ప్రయాణం. మధ్యమధ్యలో వచ్చే చిన్నచిన్న దీవులు పర్యాటకులను ప్రకృతి ప్రేమలో పడేస్తాయి.
ఈ లాంచీ ప్రయాణంలో పర్యాటకులకు రకరకాల పక్షులు స్వాగత గీతాలు పలుకుతాయి. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లన్న దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి దర్శనం చేసుకొని డ్యాం సైట్ దగ్గర శ్రీశైలం ప్రాజెక్టు అందాలు చూసే అవకాశం ఉంటుంది. మొత్తంగా నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం లాంచీ ప్రయాణం ఒక మధురానుభూతిని మిగులుస్తుంది.