AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం

నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లి‍దోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు.

శ్రీశైలం శివయ్య దర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం
Sudhakar Pathare
Boorugu Shiva Kumar
| Edited By: Ram Naramaneni|

Updated on: Mar 29, 2025 | 6:26 PM

Share

నాగర్ కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పాతరే, ఆయన బంధువు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఉగాది పండుగ ముందురోజు నల్లమల అడవిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అమ్రాబాద్ మండలం దోమలపెంట ఆక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో శ్రీశైలం నుంచి వస్తోన్న ఆర్టీసి బస్సు, బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఘటనలో మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి డా సుధాకర్ పాతరే, ఆయన బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదంలో ఇన్నోవా కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న ఈగలపెంట పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసారు. అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు. అయితే దారిలో వెల్దండ సమీపంలోనే ఇద్దరు తుదిశ్వాస విడిచారు. మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్రైనింగ్ కోసం NPA హైదరాబాద్‌కు

ప్రస్తుతం డా,సుధాకర్ పాతరే ముంబై పోర్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఆయన DIG గా ప్రమోషన్ పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక విధుల్లో భాగంగా ప్రస్తుతం ఆయన NPA లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు ఉదయం బంధువు భగవత్ కిషన్ రావు పాటిల్ తో కలిసి ఇన్నోవా కారులో ప్రయాణం అయ్యారు. మరి కొన్ని నిమిషాల్లో శ్రీశైలం చేరుతామనగా మృత్యువు కబళించింది. ఇక డా,సుధాకర్ పాతరే మరణ వార్త తెలియడంతో ఆయన కుటుంబంలో విషాదం నిండుకుంది. మరోవైపు డా,సుధాకర్ పాతరే మృతిపట్ల ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ సంతాపం తెలిపారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..