Monsoon Traffic Plan: సైబరాబాద్‌లో వర్షాకాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. సీపీ రమేష్ ఐపీఎస్ కీలక ఆదేశాలు!
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వర్షాకాల ట్రాఫిక్ సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారు. వర్షాల కారణంగా ఏర్పడే ట్రాఫిక్ అంతరాయాలు, వాటర్ లాగింగ్ సమస్యలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు.

వర్షాకాలంలో ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని, నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాఫిక్ నిర్వహణలో సహకరిస్తున్న గ్రేహౌండ్స్, ఆక్టోపస్‌కు చెందిన సుమారు 150 మంది సిబ్బంది విధుల నిర్వహణ, ప్రజలకు అందిస్తున్న సేవలు, వర్షాకాలంలో స్పందన తీరుపై సమీక్ష నిర్వహించి అవసరమైన మార్గదర్శకాలు జారీ చేశారు.
జంక్షన్ల వద్ద ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లను అడ్డుకునే వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, రాంగ్ రూట్‌లో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. అలాగే వాటర్ లాగింగ్ సమస్యలు తరచూ ఎదురయ్యే ప్రాంతాలపై సమగ్ర మాస్టర్ డాక్యుమెంట్ సిద్ధం చేసి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రోడ్డు కటింగ్ పనులు ప్రారంభించే ముందు ట్రాఫిక్ పోలీసులతో తప్పనిసరిగా సమన్వయం చేసుకుని ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను అమలు చేయాలని సూచించారు. విప్రో జంక్షన్, డీఎల్‌ఎఫ్ జంక్షన్, షాపూర్ నగర్, కూకట్‌పల్లి వై-జంక్షన్, మియాపూర్, నిజాంపేట్ ప్రాంతాల్లో కొనసాగుతున్న పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్, వాటిని వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
రాత్రి వేళల్లో విధులు నిర్వహించే ట్రాఫిక్ సిబ్బంది తప్పనిసరిగా రిఫ్లెక్టివ్ జాకెట్లు, రెయిన్ కోట్లు ధరించాలని కమిషనర్ ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు సురక్షితమైన, అంతరాయం లేని ప్రయాణాన్ని అందించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్న ఆయన, అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, ట్రాఫిక్ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
