Rain Alert: చల్లచల్లని కబురు.. భారీ నుంచి అతిభారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు
నైరుతి రుతుపవనాలు ఐఎండీ అధికారులు అంచనా వేసిన డేట్ ముందే.. రైతులను పలకరించనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణా శాఖ తెలిపింది. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందామా..

రైతులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. నైరుతి ఋతుపవనాలు మరింత వేగంగా దేశాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 24నే కేరలలోకి ప్రవేశించే అవకాశముందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇవి అండమాన్ నికోబార్ దీవులంతా విస్తరించాయని, అనుకున్న సమయం కంటే ఐదు రోజుల ముందుగానే ఇవి అండమాన్‌ను చేరాయని తెలిపారు. తొలుత ఈ నెల 27న నైరుతి రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ అంచనా వేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, తెలంగాణకి కూడా వర్ష సూచన ఉందని చెప్పింది. అటు అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందంది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్ ప్రాంతాల్లో ధూళి తుఫాన్లు వచ్చే ఛాన్స్ ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది.
మరోవైపు బెంగళూరును బెంబేలెత్తిస్తున్నాడు వరుణుడు…! ఎడతెరపిలేని వర్షాలతో వణికిస్తున్నాడు. దీంతో నగరం నరకం చూస్తోంది. గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు మునిగిపోయాయి. పలుచోట్ల జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాహనాలు సైతం వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. బెంగళూరు సిటీతో పాటు చిక్‌మగళూరు, తుమ్‌కూరు, మాండ్య మైసూర్, దావణగెరె సహా పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేని వర్షం కురుస్తోంది. అంతేకాదు… గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. గత మూడ్రోజులుగా కురుస్తున్న వర్షాలు ఈనెల 22 వరకూ ఉంటాయంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఆగ్నేయ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగానే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెబుతున్నారు. చాలావరకు స్కూల్స్, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు.




