Telangana: మొబైల్ కొందామని వచ్చాడనుకుంటే ఊహించని షాకిచ్చాడు.. కట్ చేస్తే.. సీన్ సితారయ్యింది
మొబైల్ షాప్ నిర్వాహకుడు దగ్గరకు ఓ వ్యక్తి వచ్చాడు. తన బంధువులకు డబ్బులు పంపించాలని.. రూ. 11 వేలు డబ్బులు చేతికి ఇస్తా.. మీరు ఫోన్ పే చేయండి అని చెప్పాడు. కట్ చేస్తే.. ఆ తర్వాత జరిగిన సీన్‌కి దెబ్బకు షాక్ అయ్యారు. ఆ వివరాలు ఇలా..

యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. గుర్తుతెలియని వ్యక్తి నకిలీ నోట్లతో ఓ వ్యాపారికి 11 వేల రూపాయల టోకరా వేశాడు. భువనగిరి పట్టణంలోని ఖిలానగర్‌లో పల్లెర్ల నాగేంద్రబాబు మొబైల్ షాపు నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు సదరు నిందితుడు వచ్చి.. బంధువులకు డబ్బులు అత్యవసరమని చెప్పాడు. తన వద్ద ఉన్న 11వేల రూపాయల నగదును తీసుకుని తన బంధువులకు 11 వేల రూపాయలు ఫోన్ పే చేయాలని కోరాడు. దీంతో మొబైల్ షాప్ నిర్వాహకుడు నాగేంద్రబాబు ఆ వ్యక్తి నుంచి 11 వేల రూపాయల నకిలీ నోట్లను తీసుకున్నాడు. తన ఫోన్ నుంచి గుర్తుతెలియని వ్యక్తి బంధువులకు 11 వేల రూపాయలను ఫోన్ పే చేశాడు.
అయితే గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన 11 వేల రూపాయల నోట్లను పరిశీలించిన నాగేంద్రబాబు.. అవి నకిలీ నోట్లుగా అనుమానించాడు. వెంటనే పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ద్వారా భువనగిరి బస్టాండ్ సమీపంలో తిరుగుతున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పోలీసులు సూచిస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే నోట్లను పరిశీలించాలని, అవి నకిలీ నోట్లగా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు.
