Telangana: సిట్టింగ్‌ ఒత్తిడి.. మేడమ్‌ మౌనం.. ఇంతకీ నర్సాపూర్ టికెట్ ఎవరికీ.. అధికారపార్టీలో తీవ్ర ఉత్కంఠ..

|

Sep 04, 2023 | 9:00 PM

Narsapur BRS Politics: ఆ నియోజకవర్గ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నరట..టికెట్ కోసం ఒక నేత హడావుడి చేస్తుంటే.. మరో నేత మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారట. ఆ మౌనం వెనుక వ్యూహముందా? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? వివరాలు తెలుసుకోండి..

Telangana: సిట్టింగ్‌ ఒత్తిడి.. మేడమ్‌ మౌనం.. ఇంతకీ నర్సాపూర్ టికెట్ ఎవరికీ.. అధికారపార్టీలో తీవ్ర ఉత్కంఠ..
Narsapur BRS Politics
Follow us on

Narsapur BRS Politics: ఆ నియోజకవర్గ టికెట్ కోసం ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట.. పార్టీ అధిష్టానం నుంచి పిలుపు ఎప్పుడు వస్తుందా అని కండ్లు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్నరట..టికెట్ కోసం ఒక నేత హడావుడి చేస్తుంటే.. మరో నేత మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారట. ఆ మౌనం వెనుక వ్యూహముందా? ఇంతకీ ఎవరా నేత? ఏదా నియోజకవర్గం? వివరాలు తెలుసుకోండి..

నర్సాపూర్ పంచాయితీ సంగతేవో గానీ పార్టీ శ్రేణుల నరాలు తెంచుతోంది టికెట్‌ ఉత్కంఠ. సీనియర్‌ మరోసారి సై అంటున్నారు. మహిళా కోటాలో తనకు సీటు గ్యారంటీ అన్న నమ్మకంతో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. దీంతో ఆ సీటు వ్యవహారం పార్టీ పెద్దలకు కూడా పెద్ద పరీక్షగానే ఉందట. అధిష్ఠానంనుంచి ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఇద్దరు నేతలు కొన్ని రోజులుగా కళ్లుకాయలు కాచేలా చూస్తున్నారు.

నర్సాపూర్ బీఆర్ఎస్ టికెట్ కోసం ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మధ్య పోటీ ఉంది. మొదట్లో సునీతా లక్ష్మారెడ్డికే టికెట్‌ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరిగింది. దీంతో అలర్ట్‌ అయిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్గం స్పీడ్‌పెంచింది. ఈ పరిణామాలతో నర్సాపూర్‌ టికెట్‌ వ్యవహారాన్ని పెండింగ్‌లో పెట్టింది బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం. దీంతో ఇద్దరు నేతల్లోనూ టెన్షన్‌ మొదలైంది. పార్టీ టికెట్‌ ఎవరికీ ప్రకటించకపోవటంతో ఇద్దరు నేతలు ఎవరికివారు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే మదన్ రెడ్డి వర్గం దాదాపుగా బలప్రదర్శనలకు దిగుతుంటే. .మాజీ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాత్రం మౌనంగా ఉండటం పార్టీ శ్రేణులను ఆశ్చర్యపరుస్తోంది.

ఇవి కూడా చదవండి

భారీగా మదన్‌రెడ్డి అనుచరులు హైదరాబాద్‌ వెళ్లి మంత్రి హరీష్‌రావును కలిసొచ్చారు. తర్వాత నియోజకవర్గపరిధిలో జోష్‌ తగ్గకుండా చూసుకుంటోందట సిట్టింగ్‌ ఎమ్మెల్యే వర్గం. రెండుసార్లు ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ టికెట్‌ తనకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి. అయితే అవతల అంత హంగామా జరుగుతున్నా.. సునీతా లక్ష్మారెడ్డి మాత్రం టికెట్‌ విషయంలో ఒక్క మాట మాట్లాడటం లేదు. దీంతో తమ నాయకురాలి మౌనం ఆమె అనుచరగణానికి ఇబ్బందిగా మారిందట. ఓ వైపు ఎమ్మెల్యే వర్గీయులు ఎదో ఒక కార్యక్రమం చేస్తుంటే.. మేడమ్ ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారో వారికి అర్ధం కావడం లేదట. కొందరు మద్దతుదారులు మేం కూడా రంగంలోకి దిగుతామన్నా.. అందుకు ఒప్పుకోవడం లేదట సునీతా లక్ష్మారెడ్డి.

సీఎం కేసీఆర్ మెదక్ టూర్‌లోనూ ఎమ్మెల్యే అనుచరులు ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేశారు. అప్పుడు కూడా తన అనుచరులను స్లోగన్స్‌ వద్దని వారించారట సునీత. నర్సాపూర్ టికెట్ ఇవ్వాలని తన తన కార్యకర్త ఒకరు సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తే కూడా దాన్ని కూడా తీసేయించారట ఆమె. సునీతా లక్ష్మారెడ్డి ఎందుకు ఇంత మౌనంగా ఉంటున్నారో ఆమె అనుచరులతో పాటు ..ఎమ్మెల్యే వర్గానికి కూడా ర్థం కావడం లేదట. మౌనమా లేదంటే ఏదైనా వ్యూహమా అనే ఆలోచనలో పడిందట ఎమ్మెల్యే వర్గం. సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైపునుంచి ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా అంతా సంయమనం పాటించాలనే పదేపదే చెబుతున్నారట సునీతా లక్ష్మారెడ్డి. టికెట్ విషయం అధిష్ఠానం చూసుకుంటుందని.. ఎవరూ లైన్‌ దాటొద్దని మేడమ్‌ కూల్‌గా చెబుతుండటం నర్సాపూర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..