Black Magic: తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి వాటిని నమ్మి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దు..!
Black Magic: చేతి వైద్యమన్నాడు.. రోగాన్ని మటు మాయం చేస్తానన్నాడు. అది నమ్మిన ఆ అమాయక తల్లి తన బిడ్డను బాబా చేతిలో పెట్టింది.
Black Magic: చేతి వైద్యమన్నాడు.. రోగాన్ని మటు మాయం చేస్తానన్నాడు. అది నమ్మిన ఆ అమాయక తల్లి తన బిడ్డను బాబా చేతిలో పెట్టింది. చివరకు మాయలోడు చేసిన మర్మాలకు ప్రాణాలు పోయే స్థితికి చేరింది. ఇలా బద్మాష్ బాబా అరాచకాలు అంతా ఇంత కాదు. మాయ మాటలతో ప్రాణాన్ని మంటల్లో కలిపే ప్రయత్నం చేశాడు. వికారాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రాలకు చింతకాయలు రాలవు.. కానీ, ప్రాణాలు కాపాడుతామంటూ గ్రామీణ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు దొంగ బాబాలు.
మంత్రగాడు.. ఓ బాలికను ప్రాణాలు తీసే ప్రయత్నం చేశాడు. అంతే కాదు.. ప్రాణాలు పోయినంత పని అయింది. బురిడి బాబా మూఢనమ్మకాల వైద్యానికి బాలిక పరిస్థితి సీరియస్‌గా మారింది. ఈ అమానుష ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కుక్కింద గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటయ్య, మంజుల దంపతుల కూతురు అశ్విని అనారోగ్యానికి గురయ్యింది. తెలిసిన వాళ్ల ద్వారా పరిగి మండలం నస్కల్ గ్రామ శివారులోని దర్గాలో ఉండే బాబా రఫీక్ దగ్గరికి తీసుకెళ్లింది. అమ్మాయిని పరిశీలించిన మాయలోడు.. షాకింగ్ న్యూస్ చెప్పాడు. బాలికకు గాలి సోకిందని.. సలసల మండే కుంపటిలో అరికాళ్లను పెట్టించాడు. మంటలకు కాళ్లు దారుణంగా కాలి పోయాయి. చేసేది ఏమి లేక.. ఇక నేనేమి చేయలేనంటూ చేతులెత్తేశాడు. పరిస్థితి విషమించడంతో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలిక పరిస్థితి సీరియస్‌గా మారింది. బాలిక పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. కాళ్ల పరిస్థితి ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కాళ్ల భాగంలో చాలా వరకు దెబ్బతిన్నాయంటున్నారు. నేటి ఆధునిక యుగంలో కూడా మంత్రాలు తంత్రాలంటూ.. చీటింగ్ చేసే చిల్లరగాళ్లను నమ్మొద్దంటున్నారు వైద్యులు.