AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FRO Srinivasa Rao Death: ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు పాడె మోసిన మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ అజయ్..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు.

FRO Srinivasa Rao Death: ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు పాడె మోసిన మంత్రులు ఇంద్రకరణ్, పువ్వాడ అజయ్..
Fro Srinivasa Rao Death
Shaik Madar Saheb
|

Updated on: Nov 23, 2022 | 1:13 PM

Share

Bhadradri Kothagudem FRO death: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండలో గిరిజనుల దాడిలో మృతిచెందిన ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు అంత్యక్రియలు ముగిశాయి. ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం ఈర్లపూడిలో ఫారెస్ట్‌ రేంజర్‌ శ్రీనివాస్‌ అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు పువ్వాడ అజయ్‌ కుమార్, ఇంద్రకరణ్‌ రెడ్డి ఈర్లపూడికి చేరుకుని.. శ్రీనివాస్ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్ర కిరణ్ రెడ్డి శ్రీనివాస్ రావు పాడే మోశారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో స్మశాన వాటికలో శ్రీనివాసరావు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించారు. మూడు రౌండ్స్ గాల్లోకి కాల్పులు జరిపిన అనంతరం శ్రీనివాసరావు చితికి పిల్లలు నిప్పంటించారు. ఈ సందర్భంగా మంత్రులు శ్రీనివాసరావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రేగా కాంతారావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డి ప్రియాంక వర్గీస్ ఉన్నారు. అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ దొబ్రియల్, తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియల్లో వేలాది మంది స్థానికులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అటవీశాఖ సిబ్బంది భారీగా పాల్గొన్నారు. శ్రీనివాసరావు అంత్యక్రియల్లో ఉద్రిక్తత నెలకొంది.. తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ అధికారులు కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రుల ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు లేకపోవడంతోనే దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

దాడులను సహించేది లేదు.. మంత్రులు..

దాడులను సహించేది లేదని.. మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. ఎర్రబోడులో శ్రీనివాసరావును దారుణంగా హత్య చేసిన వారిని వదిలిపెట్టమని, కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని.. ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసిందని మంత్రులు తెలిపారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని.. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారంటూ పేర్కొన్నారు. అడవులను నరికినట్లు అటవీ అధికారులపై దాడిచేస్తే వదిలిపెట్టమంటూ స్పష్టంచేశారు. చిన్న విషయానికే గుత్తికోయలు దాడి చేసి శ్రీనివాస్‌ను హతమార్చారని పేర్కొన్నారు.

Erlapudi Village

Erlapudi Village

విచారణ జరిపించాలి..

శ్రీనివాస్‌ మృతితో ఖమ్మం జిల్లా ఈర్లపూడిలో విషాదం నెలకొంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు ఆయన కుటుంబసభ్యులు. పలువురు నేతలు, అధికారులు శ్రీనివాస్‌కు కన్నీటి నివాళులర్పించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. దాడికి వాడిన కత్తులు, గొడ్డళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, శ్రీనివాస్‌పై దాడి పక్కా ప్లాన్‌ ప్రకారం జరిగిందని ఆరోపిస్తున్నారు కుటుంబసభ్యులు. వారు రైతులు కాదని అంటున్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని..అప్పుడే అసలు వాస్తవాలు బయటికొస్తాయని పేర్కొంటున్నారు. ఎర్రబోడు వెళ్లినప్పుడు శ్రీనివాస్‌ వెంట సెక్యూరిటీ కూడా లేకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాడి తర్వాత ఆస్పత్రికి చేర్చడానికి ఎందుకు ఆలస్యమైందని ప్రశ్నిస్తున్నారు. పోడు రైతులతో మాట్లాడుతుండగా దాడి చేశారని అంటున్నారు ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ రామారావు. కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడినా కనికరించలేదంటున్నారు.

ప్రభుత్వ మొండి వైఖరితోనే.. కాంగ్రెస్

పోడు భూముల సమస్య ఫారెస్ట్ అధికారులు, గిరిజనుల మధ్య చిచ్చుపెట్టింది.. ప్రభుత్వమేనంటూ మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఆరోపించారు. ఫారెస్ట్ అధికారి చనిపోవడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం.. అక్కడ హరితహారం మొక్కలు నాటిన ప్లేస్ లో పశువులు మేపుతున్నారని దాడి చేయబోయారు.. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నారు. తక్షణమే గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలని, దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.

భూమి కోసం చాలా కాలంగా గిరిజనులు ఎదురు చూస్తున్నారని.. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి పేర్కొన్నారు. శ్రీనివాస్ మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దీనిపై వినతిపత్రం ఇచ్చామని.. మూడు రోజుల్లో స్పందన రాకపోతే మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన తెలుపుతామని తెలిపారు.

గుత్తికోయల దాడితో..

కాగా.. చంద్రుగొండ మండలం.. ఎర్రబోడులో ప్లాంటేషన్ మొక్కలను గొత్తి కోయలు నరుకుతుండగా అడ్డుకునేందుకు వెళ్ళిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస్ పై.. గుత్తి కోయలు మంగళవారం దాడి చేశారు. తమకు భూములు దక్కకుండా చేస్తున్నారన్న ఆవేశంతో.. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. తీవ్రగాయాలపాలైన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావును ఖమ్మం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. శ్రీనివాస్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Fro Srinivasa Rao

Fro Srinivasa Rao

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..