‘కాంగ్రెస్ మాటలన్నీ వారంటీ లేని గ్యారంటీలే’.. హస్తం పార్టీపై మంత్రి కేటీఆర్ విమర్శలు..
Vanaparthy District: బీఆర్ఎస్ స్కీములతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం స్కాములకు పాల్పడుతోందని, ఆ పార్టీ చెప్పే మాటలన్నీ వారంటీ లేని గ్యారంటీలేనని, ఇప్పటికే ఐసీయూలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభ’లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని తనదైన రీతిలో..
వనపర్తి జిల్లా, సెప్టెంబర్ 29: ‘కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, మైగ్రేషన్.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు, ఇరిగేషన్’ అంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ హస్తం పార్టీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ స్కీములతో ముందుకెళ్తుంటే.. కాంగ్రెస్ మాత్రం స్కాములకు పాల్పడుతోందని, ఆ పార్టీ చెప్పే మాటలన్నీ వారంటీ లేని గ్యారంటీలేనని, ఇప్పటికే ఐసీయూలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన ‘వనపర్తి పదేళ్ల ప్రగతి మహాసభ’లో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని తనదైన రీతిలో విమర్శించారు. కాంగ్రెస్‌ని నమ్మితే 24 గంటల కరెంట్‌కి బదులు 3 గంటల కరెంట్ రావడం ఖాయమని, నల్లా నీళ్లు కూడా బంద్ అవుతాయని, వాటి కోసం కూడా ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
వనపర్తి సభలో కాంగ్రెస్ పార్టీనే కాక ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ విరుచుకుపడ్డారు. పాలమూరు వస్తున్న ప్రధాని మోదీ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను ప్రకటించాలని, కృష్ణా జలాల్లో నుంచి తెలంగాణకు న్యాయంగా రావాల్సిన 575 టీఎంసీల నీళ్లను రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు మంత్రి కేటీఆర్. ‘తెలంగాణ అంటే ప్రధాని మోదీకి ఎందుకింత కక్ష..?’ అని ప్రశ్నించిన ఆయన.. వాల్మీకీ బోయలకు ఎస్‌టీ హోదా కోసం 2 సార్లు తీర్మానపత్రం పంపినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలోనే కేంద్రంలో తెలంగాణ ప్రమేయం తప్పకుండా ఉండాలని కేటీఆర్ తెలిపారు.
తెలంగాణలో ప్రభుత్వ పగ్గాలను తిరిగి బీఆర్ఎస్ పార్టీకే అప్పగించాలని ప్రజలను కోరిన కేటీఆర్.. కేంద్రంలో రాష్ట్రం ప్రమేయం లేకుండా ప్రభుత్వం ఏర్పడొద్దని, అక్కడ కూడా ప్రమేయం ఉంటేనే రావాల్సిన హక్కులు వస్తాయని వివరించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరే వరకు పాలమూరును ఎవరూ పట్టించుకోలేదని, జిల్లా నుంచి లక్షలాది మంది వలస పోతున్నా గత కాలంలోని ఏ ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి అక్రమంగా నీళ్లు తీసుకు పోతుంటే హారతులు ఇచ్చి మరీ పంపించింది కాంగ్రెస్ నేతలేనంటూ హస్తం పార్టీపై కేటీఆర్ మండిపడ్డారు.
అలాగే వనపర్తి నియోజకవర్గంలో 1. 25 లక్షల ఎకరాలకు నీళ్లొచ్చాయంటే.. అది స్థానిక ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సీఎం కేసీఆర్ సంకల్పం వల్లే సాధ్యమైందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 180 కోట్లతో నూతన ఆసుపత్రి, వనపర్తిని జిల్లా చేసి కలెక్టరేట్, బంజారాహిల్స్ ఇండ్ల మాదిరిగా పీర్ల గుట్టలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం జరిగాయని.. ఇంకా ఐటీఐ, కేజీబీవీ, వ్యవసాయ డిగ్రీ కళాశాలల నిర్మాణం జరుగుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 65 ఏళ్ల పాలనలో చేయని పనిని నిరంజన్ రెడ్డి ఐదేళ్లలో చేసి చూపించారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కుడి భుజంగా తెలంగాణ జెండా ఎత్తి గ్రామగ్రామాన ఉద్యమాన్ని రగిలించారని కేటీఆర్ తెలిపారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నిరంజన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో మళ్లీ గెలిపించాలని వనపర్తి నియోజకవర్గ ప్రజలను మంత్రి కేటీఆర్ కోరారు.