
ఆయనో రాష్ట్ర మంత్రి. ప్రస్తుత రాజకీయాల్లో ఆ మంత్రి ఏం మాట్లాడినా సెన్సేషనే. నిత్యం హాట్ కామెంట్స్ చేస్తూ రాజకీయాల్లో హల్ చల్ చేస్తుంటారు. ఆయన రూటే సపరేటు. ప్రతిరోజు జనంతో మమేకమయ్యే ఆ మంత్రి తన అంగరక్షకులు, కాన్వాయ్‌ని వదిలేసి ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విస్తృతంగా పర్యటించారు. మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి బైక్‌పై పట్టణంలో కలియతిరిగారు. పల్సర్ బండెక్కి నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు. స్థానికులను పలకరిస్తూ, కార్యకర్తలతో కలసి అలా కాసేపు సరదాగా తిరుగుతూ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఉదయం నల్గొండ క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన ఆర్జీదారులను కలిసిన మంత్రి.. తర్వాత జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు.
తన గన్ మెన్లు, కాన్వాయ్‌ని వదిలేసి కార్యకర్త పల్సర్ బండిని తీసుకొని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టణంలో సందడి చేశారు. పట్టణంలోని మాన్యం చెల్క, హైదర్ ఖాన్ గూడా, రహమత్ నగర్లో జీరో విద్యుత్తు బిల్లుల వినియోగదారుల ఇళ్లకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం గురించి స్వయంగా లబ్ధిదారులకు వివరించారు. మంత్రి రాకతో ఆనందం వ్యక్తం చేసిన లబ్ధిదారులు గత ప్రభుత్వంలో తాము ఎదుర్కొన్న కష్టాలను ఏకరువు పెట్టారు. గృహజ్యోతి ద్వారా ఉచిత విద్యుత్తు, బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500 లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు మహిళల కష్టాలను తీర్చుతున్నాయని స్థానిక మహిళలు తమ ఆనందాన్ని మంత్రితో పంచుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూస్తున్నామని లబ్ధిదారులు తమ భావనను మంత్రి కోమటిరెడ్డికి తెలియజేశారు.
ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల పోస్టర్‌ను మంత్రి కోమటిరెడ్డి విడుదల చేశారు. రాబోయే పది రోజుల్లో పేదలకు ఇళ్లు నిర్మించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని, కాంగ్రెస్ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలన్నింటిని 90 రోజుల్లోనే అమలు చేస్తున్నామని తెలిపారు. నల్గొండలో ఆర్య సమాజ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మంత్రిని సమాజ్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..