Skill University: మేఘా సంస్థకు మరో అరుదైన అవకాశం.. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన సర్కార్

తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణానికి ముందుకువచ్చింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. యూనివర్సిటీ నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కీలక ఒప్పందం కుదరింది.

Skill University: మేఘా సంస్థకు మరో అరుదైన అవకాశం.. స్కిల్ యూనివర్సిటీ నిర్మాణ బాధ్యతలు అప్పగించిన సర్కార్
Young India Skill University Campus Mou
Follow us

|

Updated on: Oct 26, 2024 | 7:01 PM

తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో మరో ముందడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన స్కిల్స్ యూనివర్సిటీ భవన నిర్మాణానికి ముందుకు వచ్చింది మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL). మొత్తం యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణానికి మేఘా కంపెనీ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ నిధుల నుంచి 200 కోట్ల సాయం ప్రకటించింది. వీటితో యూనివర్సిటీ క్యాంపస్‌లో అవసరమైన భవనాలన్నింటినీ నిర్మించే బాధ్యతలను స్వీకరించింది.

తెలంగాణ యువతకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకువచ్చేలా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా హైదరాబాద్ శివారులో ప్రపంచ స్థాయి అధునాతన నమూనాలతో అన్ని మౌలిక వసతులు ఉండేలా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మించాలని సంకల్పించారు. ఇటీవల రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్కిల్‌ యూనివర్శిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ. 100కోట్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే యూనివర్శిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్‌ఫండ్‌ ఏర్పాటుకు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రప్రభుత్వానికి అండగా ఉండేందుకు మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా యూనివర్సిటీ భవన నిర్మాణ బాధ్యతలను మేఘా ఇంజనీరింగ్ సంస్థ స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది.

శనివారం(అక్టోబర్ 26) సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డితో మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి నేతృత్వంలోని కంపెనీ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకునేందుకు అంగీకరించింది. ఈమేరకు సర్కార్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కిల్స్ యూనివర్సిటీ క్యాంపస్ నిర్మాణం చేపడుతామని మేఘా సంస్థ ప్రకటించింది.

యూనివర్సిటీ భవనాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వంతో మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వీఎల్వీఎస్ఎస్ సుబ్బారావు సమక్షంలో ఎంవోయూపై సంతకాలు చేశారు. సీఎస్ఆర్ నిధులతో ఈ క్యాంపస్ నిర్మాణానికి మెఘా కంపెనీ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. అకడమిక్ బిల్డింగ్, వర్క్‌షాపులు, తరగతి గదులతో పాటు హాస్టల్ బిల్డింగ్ నిర్మిస్తామన్న మేఘా కంపెనీ ఎండీ కృష్ణారెడ్డి తెలిపారు.

ఇప్పటికే ఆర్కిటెక్ట్ నిపుణులతో తయారు చేయించిన యూనివర్సిటీ భవన నిర్మాణ నమూనాలను, డిజైన్లను మేఘా సంస్థ ప్రతినిధులు ఈ సమావేశంలో ప్రదర్శించారు. వారం రోజుల్లోగా భవన డిజైన్లకు తుది రూపు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. నవంబర్ 8వ తేదీ నుంచి యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం తరఫున అందుకు అవసరమైన సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇందుకు అనుగుణంగా మార్పులతో ప్రతిష్టాత్మక నిర్మాణాకి సంసిద్ధత వ్యక్తం చేశారు మేఘా సంస్థ ప్రతినిధులు.

ఇటీవల తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. సమావేశంలో మంత్రులు, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కీలక అంశాలను సమావేశంలో పాల్గొన్న పారిశ్రామికవేత్తలకు అధికారులు వివరించారు. యూనివర్శిటీ నిర్వహణకు ఎవరికి తోచింది వారు వివిధ రూపాలలో సహకారం అందించాలని సీఎం కోరారు. ఈ ఏడాది నుంచే స్కిల్‌ యూనివర్శిటీలో ప్రారంభించే పలు కోర్సులతోపాటు కీలక అంశాలను అధికారులు.. పారిశ్రామిక వేత్తలకు వివరించారు.

తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న సీఎం ఆలోచన గొప్పదని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. మంచి విజన్ ఉన్న నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ప్రశంసించారు. యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా నియమించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..