Telangana: అమ్మో.. మణుగూరులో అరుదైన పాము.. ఇది కానీ కాటు వేసిందా..?
మణుగూరులోని సింగరేణి అధికారుల నివాసం ప్రాంతంలో కనిపించిన అరుదైన ‘బ్యాండెడ్ క్రైట్’ పాము కలకలం రేపింది. ఇది అత్యంత విషపూరితమైన పాము. అయితే… తాకినంత మాత్రాన దీని విషం మన శరీరంలోకి రాదు. కానీ కాటు వేయగల సామర్థ్యం ఎక్కువ. ఇంకా వివరాల్లోకి వెళ్తే...

సింగరేణి అధికారుల నివాసం ఉండే కాలనీలో అత్యంత విషపూరితమైన పాము కనిపించడంతో కలకలం రేగింది. సకాలంలో స్పందించిన స్నేక్ క్యాచర్ ముజఫర్ పామును సురక్షితంగా పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. సింగరేణి అధికారి వీరభద్రం నివసిస్తున్న క్వార్టర్‌లో సెక్యూరిటీ సిబ్బందికి ఓ నలుపు, పసుపు రంగుల గీతలతో ఉన్న పొడవాటి పాము కనిపించింది. వెంటనే స్నేక్ క్యాచర్ ముజఫర్‌కు సమాచారం అందించారు. అతను అక్కడికి చేరుకొని.. 3 గంటల పాటు కష్టపడి చాకచక్యంగా పామును సురక్షితంగా పట్టుకున్నారు.
ఈ పాము పేరు బ్యాండెడ్ క్రైట్ అని స్నేక్ క్యాచర్ ముజఫర్ తెలిపారు. ఇది అత్యంత విషపూరితమైన జాతికి చెందినదని పేర్కొన్నారు. ఈ జాతి పాములు ఎక్కువగా రాత్రి సమయంలో సంచరిస్తాయన్నారు. పగటిపూట ఇవి మట్టిలో, రాళ్ల కింద లేదా చెట్ల వేర్ల మధ్య దాక్కుంటాయట. ఇవి ప్రధానంగా ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కనిపిస్తాయని చెప్పారు. ఈ పాము కాటు వల్ల తక్షణమే నర్వ్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది. శ్వాస ఆడకపోవడం, గుండె స్పందన మందగించడంతోపాటు, పాక్షిక వాతం వస్తుందన్నారు. తీవ్ర విషంతో మరణానికి దారి తీసే ప్రమాదం ఉంటుందని వివరించారు.
ఇలాంటి పాములు నివాస ప్రాంతాల్లోకి రావడం అపాయం సిగ్నలే అని ముజఫర్ హెచ్చరిస్తున్నారు. ఇవి కనిపించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని హ్యాండిల్ చేయకుండా.. వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




