
Mancherial district news: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన రోగిపై మరో రోగి కత్తులతో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన రోగి వరంగల్ ఎంజిఎం కు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలోని క్యాజువాల్టిలో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆస్పత్రి సిబ్బంది బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. గాయాలపాలైన వ్యక్తి మృతి చెందడంతో ఆలస్యంగా ఘటన వెలుగు చూసింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామానికి చెందిన చిలుక దేవయ్య (49 ) అనే వ్యక్తి అనారోగ్యంతో జూన్ 6 న మంచిర్యాల జిల్లా ఆస్పత్రిలో చేరాడు. పరీక్షించిన వైద్యులు చికిత్సలో భాగంగా వారం రోజుల ఉండాలంటూ సూచించారు. క్యాసువాల్టీ వార్డ్ కు షిప్ట్ చేశారు.
గత ఆదివారం అర్థరాత్రి 3 గంటల ప్రాంతంలో పక్క బెడ్ పై చికిత్స పొందుతున్న వ్యక్తి దేవయ్య పై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి కేకలు వేయడంతో ఆస్పత్రి సిబ్బంది సెక్యూరిటీ దాడికి పాల్పడిన వ్యక్తిని అడ్డుకుని మరో వార్డ్ కు తరలించారు. అప్పటికే దేవయ్య అనారోగ్యంతో బాదపడుతుండటం.. చాతిపై బలమైన కత్తిపోట్లు కావడంతో హుటాహుటిన అత్యవసర నిమిత్తం వరంగల్ ఎంజిఎంకు తరలించారు. ఎంజిఎంలో మూడు రోజులుగా చికిత్స పొందిన దేవయ్య ఈరోజు ఉదయం మృతి చెందడంతో అసలు విషయం బయటపడింది.
నరాల బలహీతతో ఆస్పత్రిలో చేరితే కత్తుల దాడితో ప్రాణాలు పోయాయని కన్నీరు మున్నీరవుతున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మద్యం మత్తులో అపస్మారక స్థితిలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రిలో చేర్చారని.. దాడికి పాల్పడ్డ వ్యక్తి మహారాష్ట్ర వాసి అని గుర్తించారు పోలీసులు. ఆస్పత్రిలో కత్తుల దాడి విషయం బయటకు రాకుండా చూడటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని చికిత్స అనంతరం అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..