Hyderabad: హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లోనే ఆరుగురు మృతి
హైదారబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శంషాబాద్‌లో సమీపంలోని ORR ఎక్సిట్ 16 వద్ద ఆగి ఉన్న ఓ లారీని వ్యాగనార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారుకు కూడా ఉన్నట్టు సమాచారం. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఓవర్ స్పీడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమింకగా నిర్ధారణకు వచ్చారు.

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లి వస్తుండగా ఈ దారుణం జరిగింది. అతివేగంగా వచ్చిన వ్యాగనార్ కారు ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగివున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ విషాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోంది. ప్రాణాలతో బయటపడ్డ ఓ మహిళలను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన ఆరుగురిలో ముగ్గురు పిల్లలే ఉండటం గుండె పిండేస్తోంది.
దాదాపు 120 స్పీడు మీద కారు వచ్చి లారీని ఢీకొట్టిందని డ్రైవర్ చెబుతున్నాడు. ఓవర్ స్పీడ్ వల్ల లారీ వెనుక భాగంలో కారు ఇరుక్కుపోవడంతో… ఇంతటి ఘోరం జరిగిందంటున్నాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కారును బయటకు తీసేందుకు సాయం చేశారు. అయితే.. ఓవర్ స్పీడే ప్రమాదానికి కారణమన్న పోలీసులు..కారు మీద అప్పటికే రెండు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.
ప్రమాదంలో చనిపోయిన శివ, శ్రీనివాస్ బావబావమరుదులు. స్వస్థలం రాజన్న సిరిసిల్ల అయినప్పటికీ.. హైదరాబాద్ సనత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. శివ వ్యాపారం చేస్తుండగా.. శ్రీనివాస్ ఓ ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలారోజుల తర్వాత అందరూ కలవడంతో ఉదయం యాదగిరిగుట్టకు వెళ్లారు. సాయంత్రానికి ఇలా తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు.
ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఇలా ఒక్కసారే చనిపోవడంతో స్వస్థలం సిరిసిల్లలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నవయస్సులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండటం యావత్ సిరిసిల్లనే కంటతడి పెట్టిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
