Maharashtra BRS: బీఆర్ఎస్‌కు జై కొడుతున్న ‘మహా’ ప్రజలు.. కేసీఆర్ ఓకే అంటే పోటీకి సై అంటున్న సర్పంచులు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారు. అవకాశం ఇస్తే మహారాష్ట్రలో..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీకి మహారాష్ట్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు ఆకర్షితులవుతున్నారు. అవకాశం ఇస్తే మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడతామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మల్ జిల్లా సరిహద్దున గల మహారాష్ట్రలోని నాందెడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా పరిధిలోని 50 గ్రామాల సర్పంచులు కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు మద్ధతు ప్రకటించారు. శివసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సర్పంచులు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు సై అన్నారు. తెలంగాణలో అమలవుతున్న వివిధ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు పరచాలని వివిధ పార్టీల సర్పంచులు తెలంగాణ సీఎంను కోరారు. బీఆర్ఎస్‌కు మద్ధతుగా మూకుమ్మడి రాజీనామాలకు సైతం సిద్ధం అని ప్రకటించారు.
ధర్మాబాద్‌కు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ పటేల్ ఒట్టే అధ్యక్షతన ధర్మాబాద్ తాలూకా సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు సురేఖ లక్ష్మణరావు నిదానకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కు మద్దతుగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి మద్ధతు తెలుపుతూ తీర్మానం చేశారు. దాదాపు 20 గ్రామాల సర్పంచులు తాము బీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో నిలిచేందుకు సై అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలైన కళ్యాణ్ లక్ష్మి, రైతుబంధు తదితర పథకాలతో పాటు, అభివృద్ధి, సేవలు తమను ఎంతగానో ఆకర్షించినట్లు అక్కడి సర్పంచ్‌లు తెలిపారు. కేసీఆర్ ఒప్పుకుంటే తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేసి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయడానికి తామందరం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహకారంతో త్వరలో తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ను కలిసి తమ విధివిధానాలను తెలియజేస్తామని తెలిపారు సర్పంచ్‌ల సంఘం సభ్యులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..