Sircilla: క్రికెట్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరిగెత్తిన యువకులు.. పిడుగు పడటంతో..
అప్పటివరకు అందరూ జోష్‌లో క్రికెట్ ఆడుతున్నారు. ఇంతలోనే వర్షం మొదలైంది. దీంతో అందరూ ఓ చెట్టు కిందకు పరుగులు తీశారు. మెరుపులు, ఉరుములతో వర్షం తీవ్రత పెరిగింది. ఈ లోపు ఓ పిడుగు ఆ యువకులు నిల్చున్న చెట్టుపై పడింది. అందరూ సొమ్మసిల్లి కిందపడిపోయారు. అయితే చెట్టు ఓ పక్కకు ఒరిగి ఉండటంతో.. పిడుతు తీవ్ర సతీష్ అనే యువకుడిపై ఎక్కువగా పడి అతడు మరణించాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 3: అప్పటి వరకు.. అందరూ కలిసి క్రికెట్ ఆడుకున్నారు.. ఇంతలోనే భారీ వర్షం మొదలైయింది.. వర్షంతో పాటు.. మెరుపులు.. ఉరుములు.. పిడుగులు.. భయంతో దగ్గర్లోని ఓ చెట్టు కిందికి పరుగులు తీశారు ఐదుగురు వ్యక్తులు.. అదే చెట్టు పైన పిడుగు పడటంతో.. ఓ యువకుడు మృతి చెందగా.. మరో నలుగురు సేఫ్ గా బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల జిల్లా బోనాల సమీపంలో యువకులు ప్రతి ఆదివారం క్రికెట్ ఆడుతుంటారు. ఈ వారం కూడా అందరూ కలిసి మైదాన ప్రాంతానికి వెళ్లారు. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడడానికి వెల్లిన గణేష్ నగర్‌కు చెందిన పడిగే సతీష్(32)అనే యువకుడు పిడుగు పాటుకు మృతి చెందాడు. స్నేహితులతో క్రికెట్ ఆడుతుండగా ఒక్కసారిగా వర్షం రావడంతో అక్కడ దగ్గరలో ఉన్న చెట్టు కిందకు ఐదుగురు వెళ్లారు. అయితే చెట్టు ఓ వైపుకు ఒరిగి ఉండడం వలన సతీష్ అనే వ్యక్తిపై పిడుగు ప్రభావం ఎక్కువగా పడింది. దీంతో మృతిచెందాడు. పక్కన ఉన్న అతని ఫ్రెండ్స్ ఒక్కసారిగా అందరూ సొమ్మసిల్లి పడిపోయారు. హుటాహుటిన వారిని అంబులెన్స్ లో ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పడిగే సతీష్ డాక్టర్లు చికిత్స అందించే లోపు మరణించాడని కుటుంబ సభ్యులకు తెలిపారు. ఒక్కసారిగా కన్న కొడుకు పిడుగు పాటుతో మరణించడంతో తల్లిదండ్రులు, భార్య పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు. మృతునికి భార్య మధు ప్రియ, ఒక కొడుకు ఉన్నారు. మృతుడు మెకానిక్ షాప్ నిర్వహిస్తూ జీవిస్తున్నాడు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలి వేడుకుంటున్న కుటుంబ సభ్యులు. మిగతా యువకులు ఈ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు.. అప్పటి వరకు అందరితో మాట్లాడి.. ఇంతలోనే విగత జీవిగా మారిన తమ స్నేహితుడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం.. మృతదేహన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.
వచ్చే 3 రోజులు వర్షాలు దంచి కొడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వర్షం పడేలా ఉంటే ఎవరూ చెట్ల కింద నిలబడవద్దు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి. ముఖ్యంగా రైతులు, రైతు కూలీలు, జీవాల కాపర్లు మబ్బు పట్టిన వెంటనే ఇళ్లకు వెళ్లడం మంచిది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం