తెలంగాణ బిజెపిలో రెబల్స్.. బరిలో నిలిచే అభ్యర్థులకు గుబుల్..

ఎన్నికలు అంటేనే సీట్లు.. పాట్లు.. ఓట్లు. ఇక సీట్లు రాని నేతలైతే అవకాశం ఉంటే జంపింగ్ లేదంటే అలక. పీక్స్‎లో ఉంటే రెబల్‎గా బరిలోకి సై అంటారు. ఎన్నికల వేళ పార్టీలకు రెబల్స్.. గుబుల్ తప్పడం లేదు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారింది.

తెలంగాణ బిజెపిలో రెబల్స్.. బరిలో నిలిచే అభ్యర్థులకు గుబుల్..
Telangana BJP
Follow us

| Edited By: Srikar T

Updated on: Mar 26, 2024 | 7:10 PM

ఎన్నికలు అంటేనే సీట్లు.. పాట్లు.. ఓట్లు. ఇక సీట్లు రాని నేతలైతే అవకాశం ఉంటే జంపింగ్ లేదంటే అలక. పీక్స్‎లో ఉంటే రెబల్‎గా బరిలోకి సై అంటారు. ఎన్నికల వేళ పార్టీలకు రెబల్స్.. గుబుల్ తప్పడం లేదు. తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని అందరికంటే ముందు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసిన భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ఇదే తలనొప్పిగా మారింది. నాలుగైదు స్థానాల్లో అసంతృప్తి రగులుకుంది. ముఖ్యంగా ఆదిలాబాద్‎లో సిట్టింగ్ ఎంపీ బాపురావును కాదని బిఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నగేశ్‎కు టికెట్ ఇవ్వడంతో బాపురావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదిలాబాద్‎లో తనవల్లే నాలుగు ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని అయినా పార్టీ తనని పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిజెపి రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని సోయం బాపురావు చెబుతున్నారు. ప్రధాని మోడీ ఫోటో పెట్టుకొని ప్రచారం చేస్తానని.. ఎన్నికల్లో ఆదివాసీల మద్దతు తనకే ఉంటుందని సోయం అంటున్నారు. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగలోకి దిగింది. ఇప్పటికే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనతో ఫోన్‎లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరం అయితే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం.. ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తాననంటున్నారు.

వరంగల్ లోక్ సభ నియోజకవర్గంలోనూ ఆరూరి రమేష్‎కు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని బిఆర్ఎస్ నుంచి తీసుకొచ్చి నిలబెట్టాల్సిన అవసరం ఏంటని పార్టీని నిలదీస్తున్నారు. గత కొంతకాలంగా నియోజకవర్గంలో పని చేసుకుంటున్న బిజెపి యువనేత చిటూరి అశోక్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా అంటూ తేల్చి చెప్పారు. బిజెపిలోని స్థానిక నేతలెవరికి ఇచ్చినా సహకరించే వాళ్లమని.. ఆరూరికి ఇవ్వడంతో ఎట్టిపరిస్థితుల్లో రెబల్‎గా నిలబడి సత్తాచాటుతామని అంటున్నారు. మరికొందరు వరంగల్ జిల్లా నేతలు కూడా ఆరూరి అభ్యర్థితత్వంపై గుర్రుగా ఉన్నారు. వీరందరిని కలుపుకొని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు ఆరూరి ముందున్న సవాలు. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశలు కనిపిస్తున్నాయి.

జహీరాబాద్‎లోనూ బిబి పాటిల్‎కు టికెట్ ఇవ్వడాన్ని బిజెపిలోని మరోవర్గం వ్యతిరేకిస్తోంది. ఇక్కడ జైపాల్ రెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆయన ఇంకా అసంతృప్తి వీడలేదు. బిఆర్ఎస్ నేతను తీసుకొచ్చి సీటు ఇవ్వడంపై పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నా.. రెబల్‎గా బరిలో దిగాలా వద్దా అన్నదానిపై అనుచరులు, కార్యకర్తలతో జైపాల్ రెడ్డి చర్చిస్తున్నారు. పార్టీ రాష్ట్ర నాయకత్వ తీరుపై స్థానిక నేతలు మండిపడుతున్నారు. మెదక్ సీటు ఆశించిన నేతల్లో అంజిరెడ్డి కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎంపీ సీటు ఇస్తామన్న పార్టీ.. ఎమ్మెల్యేగా ఓడిన రఘునందన్‎కు టికెట్ ఇవ్వడం పట్ల అంజిరెడ్డి అసహనం వ్యక్తం చేస్తున్నారు. వలస నేతలకు టికెట్లు ఇవ్వడంతో పాత నేతలు అలక పాన్పు ఎక్కారు సరే. టికెట్ కోసమే పార్టీలో చేరిన నేతకు బిజెపికి షాక్ ఇచ్చింది. ఖమ్మం స్థానం ఆశించి జలగం వెంకటరావు కాషాయ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు చేరిన నలుగురి టికెట్ ఇచ్చినా జలగంకు మాత్రం ఝలక్ ఇచ్చారు. రీసెంట్ ఖమ్మంను తాండ్ర వినోద్ రావుకు ఇవ్వడంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో జలగం ఉన్నారు. ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను పార్టీ నేతలు ఇంతవరకు సంప్రదించలేదని వారంత మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన అలకపాన్పు ఎక్కిన నేతలతో మాట్లాడి బుజ్జగిస్తారో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles