Telangana: కాంగ్రెస్ బీసీ రాజకీయానికి బీఆర్ఎస్ కౌంటర్
బీసీల కోసం రాజకీయ పోరాటానికి సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఈ విషయంలో కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందుకోసం కామారెడ్డిని వేదికగా చేసుకోవాలని డిసైడయ్యింది. మరోవైపు పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగాలని నేతలు, శ్రేణులకు సూచించారు.

తెలంగాణలోని ప్రధాన పార్టీల రాజకీయాలన్నీ బీసీల చుట్టూ తిరుగుతున్నాయి. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ సర్కార్.. ముందుగా కులగణన సర్వే చేపట్టింది. ఆ సర్వే నివేదికను అసెంబ్లీ ముందు ఉంచి బీసీలకు సామాజిక న్యాయం చేసేందుకు అడుగులు వేస్తున్నామని ప్రకటించింది. ఈ క్రమంలో స్వతంత్రం తరువాత దేశంలో కులగణన చేపట్టి బీసీల జనాభా లెక్కలను తేల్చింది తామే అంటోంది కాంగ్రెస్. ఇది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని.. ఈ విషయాన్ని బీసీలు గుర్తించాలని కోరుతోంది. కులగణన సర్వే అంశాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించింది.
కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చేలా బీఆర్ఎస్ వ్యూహాం
అయితే కాంగ్రెస్ బీసీ రాజకీయాలకు కౌంటర్ సిద్ధం చేస్తోంది బీఆర్ఎస్. పార్టీలోని బీసీ నేతలతో సమావేశమైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కులగణన సర్వేలోని తప్పిదాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ముందుకు సాగాలని నేతలు, శ్రేణులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో బీసీలకు అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్. ఇందులో ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ నెరవేర్చలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్.. ఇదే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు కామారెడ్డిలోనే సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది.
కాంగ్రెస్ సభ పెట్టిన స్థలంలోనే బీఆర్ఎస్ మీటింగ్
కాంగ్రెస్‌కు ఈ అంశంలో గట్టి కౌంటర్ ఇవ్వాలంటే కామారెడ్డిలో అప్పుడు ఆ పార్టీ పెట్టిన స్థలంలోనే తాము కూడా ఓ సభను నిర్వహించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ సభ ద్వారా బీసీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ఏ విధంగా విస్మరించిందనే అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు తాము బీసీలకు ఇప్పటివరకు ఏం చేశాం.. మళ్లీ అధికారంలోకి వస్తే బీసీల కోసం ఏం చేస్తామనే అంశాలను బీఆర్ఎస్ వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కులగణన సర్వేను తీవ్రంగా తప్పుబడుతున్న బీజేపీ.. ముస్లింలను బీసీల్లో ఎలా చేరుస్తారంటూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతోంది. దీనిపై బీజేపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు. కులగణన సర్వేను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్.. ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తుండటంతో.. ఈ అంశంపై తాము కూడా సీరియస్‌గానే పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది.