అమ్మానాన్న ఇలా జరిగిందేంటి..? మొన్ననే కదా గుడ్ న్యూస్ చెప్పింది.. అంతలోనే
మృత్యువులోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ భార్యాభర్తలను లారీ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామంలో చోటుచేసుకుంది. భార్యాభర్తల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.

మృత్యువులోనూ భార్య భర్తల బంధం వీడలేదు. ఎన్నో ఆశలు ఆకాంక్షలతో జీవితాన్ని కొనసాగిస్తున్న ఆ భార్యాభర్తలను మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. భర్త చిరు వ్యాపారం చేస్తున్నాడు.. భార్య ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.. ఎంతో ఆనందంతో పిల్లలను చూసుకుంటూ.. కలలు కంటున్న ఆ కుటుంబంలో విషాద ఘటన చోటుచేసుకోవడం పలువురిని కంటతడి పెట్టించింది.. తల్లిదండ్రుల దుర్మరణంతో చిన్నారులు అనాధలుగా మారారు.
ఈ ఘటన ఖమ్మం వైరా మండలంలోని సోమవరం గ్రామ సమీపంలో అర్ధరాత్రి జరిగింది.. లారీ , ట్రాలీ ఢీకొన్న ఘటనలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డాది రాము, వెంకటరత్నం దంపతులు దుర్మరణం చెందారు. వడ్డాది రాము గ్రామాల్లో తిరుగుతూ పరుపులు అమ్ముతూ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆయన సతీమణి వెంకటరత్నం ఇటీవలనే ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం సాధించింది. ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలో విధులు నిర్వహిస్తోంది.
ఎప్పటిలాగానే భర్త రాము వ్యాపారం ముగించుకొని సతీమణి వెంకట రత్నాన్ని తన ట్రాలీ ఆటో క్యాబిన్లో కూర్చోబెట్టుకొని జగ్గయ్యపేట నుంచి వైరాకు బయలుదేరాడు. వైరా మండలం సోమవరం గ్రామ సమీపంలో.. వైరా నుంచి బోనకల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా దూసుకు వచ్చి ట్రాలీ ఆటోను ఢీ కొట్టింది. భార్య వెంకటరత్నం అక్కడికక్కడే మృతి చెందింది. భర్త రాముకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం తెలుసుకున్న వైరా ఎస్సై పుష్పాల రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్ లో గాయాల పాలైన రామును ఆస్పత్రికి తరలించారు. రామారావు చికిత్స పొందుతూ ఆయన కూడా మృతి చెందాడు. వైరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లిదండ్రులు మరణంతో పిల్లలు అనాధలుగా మారారు. అమ్మ నాన్న మాకు దిక్కు ఎవరు..మమ్మల్ని వదిలి ఎక్కడకు వెళ్ళారంటూ చిన్నారుల రోదిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. భార్యాభర్తల దుర్మరణంతో వైరాలోని టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
