మరణానికి ఆటోగ్రాఫ్ ఇచ్చిన డాక్టర్ ఏపూరి హర్షవర్ధన్.. చావును ముందే తెలుసుకున్న రియల్ లైఫ్ హీరో కథ ఇది..
మనిషికి పుట్టుక ఓ ఆనందం... చావు ఓ పెను విషాదం! చావు ఎవరికీ చెప్పిరాదు. ఒకవేళ చనిపోబోతున్నామని ముందే తెలిస్తే ఏమైనా ఉందా.. బహుశః అందుకే పుట్టుక గురించి ముందే తెలుసుకోగలిగే అవకాశం కల్పించిన దేవుడు, చావుని దాచిపెట్టేశాడు. కేవలం సినిమాలలో హీరోలు మాత్రమే చూపించే ఈ గుండెనిబ్బరం డాక్టర్ హర్షవర్ధన్ రియల్ లైఫ్‌లో చేసి చనిపోయినా రియల్ లైఫ్ హీరోగా అందరి గుండెల్లో నిలిచిపోయాడు.
ఒక డాక్టర్ జీవితం.. చావు, పుట్టుకల మధ్య మిగిలేదే జీవితం.. ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతామని తెలిసి కూడా బతకడమే కదా జీవితం అంటే.. కానీ ఆ చనిపోయేది ఎప్పుడో కాదు ఇప్పుడే అని తెలిస్తే.. నీ బతుకు ఇక్కడితో ముగిసిపోతోందని ముందుగానే తెలిసిపోతే ఎంతలా ఢీలా పడిపోతాం.. బతికుండగానే చావుకళ ఆవహిస్తుంది..మృత్యువు భయం రూపంలో రోజురోజుకూ కబళిస్తుంది.. ఆ ఉన్నన్ని రోజులూ.. నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, దుఖంతోనే కదా నడిచేది.. కానీ ఆ కుర్రాడు అలా చేయలేదు..ఆ మాదిరిగా నీరుగారిపోలేదు.. తాను త్వరలోనే చనిపోతానని తెలిసినప్పటికీ.. ఉన్నన్ని రోజులు హ్యాపీగా బతికాడు..ఆఖరికి చనిపోయాక మృతదేహాన్ని కూడా తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు.. ఖమ్మం జిల్లాకు చెందిన హర్షవర్షన్ విషాద గాధ ఇది.. మూడు పదుల వయసుకే నిండునూరేళ్లు నిండిపోయిన ఓ యువకుడి జీవిత గాధ ఇది..
ముప్పైమూడేళ్లకే నూరేళ్లు
ముప్పైమూడేళ్ల వయసు…ఆస్ట్రేలియాలో టాప్ హాస్పిటల్ లో డాక్టర్ ఉద్యోగం..నచ్చిన బంగారు బొమ్మలాంటి అమ్మాయితో పెళ్లి కూడా అయింది..కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణం.. తనని ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు..ఆర్థికంగా ఎలాంటి లోటూ లేదు.. జీవితానికి ఇంతకంటే ఏం కావాలి.. చాలామందికి దక్కని అందమైన జీవితం ఇది.. ఖమ్మం పట్టణానికి చెందిన హర్షవర్ధన్ జీవితం ఇది.. ప్రపంచంలో తనంతటి అదృష్టవంతుడు ఇంకొకరు లేరు అన్నట్టుగా సంతోషం మొత్తాన్ని తన ఇంట్లోనే నింపుకుని హ్యాపీగా సాగుతోంది జీవితం..అయితే అంతలోనే అత్యంత దారుణమైన వార్త.. అప్పటివరకూ సాగిపోతున్న ఆనందమయ జీవితంలో ఊహించని షాక్.. ఏదో అనారోగ్యంతో టెస్టులు చేయించుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అని తేలింది .అందరికీ ప్రాణం పోసే డాక్టర్ అయి ఉండి ఇప్పుడు తన ప్రాణం పోతోందని అర్థం చేసుకున్నాడు..అయితే స్వతహాగా డాక్టర్ కాబట్టి చికిత్స చేస్తే కోలుకుంటానా లేదా అనేదానిపై స్వయంగా అంచనా వేసుకున్నాడు..ప్రయోజనం లేదు.. ఇక ఎక్కువ రోజులు బతికను..ఈ లోకంలో ఇక ఉండే అదృష్టం లేదు. ఇప్పటివరకూ ఉన్న అదృష్టాన్ని దురదృష్టం ఆక్రమించేసింది. తన జీవితంలో ఉన్న సంతోషాన్ని విషాదం లాక్కుంది..
ఖమ్మం నుంచి ఆస్ట్రేలియా దాకా..
ఖమ్మం నగరంలోని శ్రీనివాసనగర్ చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు తండ్రి స్థిరాస్తి వ్యాపారి, తల్లి ప్రమీల ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు. పెద్ద కుమారుడు. హర్షవర్ధన్ (33), రెండో కుమారుడు అఖిల్. హర్షవర్ధన్ బి ఫార్మసీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు 2013లో ఆస్ట్రేలియా వెళ్లాడు. బ్రిస్బేన్లోని యూనివర్సిటీలో హెల్త్ మేనేజ్మెంట్, జనరల్ మెడిసిన్ పూర్తి చేశాడు. క్వీన్స్ ల్యాండ్ నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డాక్టర్ గా చేరాడు. 2020 ఫిబ్రవరి 20న ఖమ్మం వచ్చి వివాహం చేసుకున్నాడు హర్ష వర్ధన్ వీసా వచ్చిన తరువాత భార్యను తీసుకెళ్తానని చెప్పి… అదేనెల 29న తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు. అదే ఏడాది అక్టోబరు నెలలో వ్యాయామం చేస్తుండగా దగ్గుతో పాటు ఆయాసం రావడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. ఈ పరిస్థితుల్లో ఇంటికి తిరిగి వచ్చేయమని తల్లిదండ్రులు కోరగా ఇక్కడే మంచి చికిత్స లభిస్తుంది. మీరేం కంగారు పడకండి అని వారికి నచ్చజెప్పాడు. బతకడానికి ప్రయత్నించాడు..మెరుగైన ట్రీట్మెంట్ తీసుకున్నాడు..ఆస్ట్రేలియాలో అద్భుతమైన అధునాత వైద్యం అందినప్పటికీ ప్రయోజనం లేదు..నీకేం పర్వాలేదు..జబ్బు తగ్గిపోతుంది..ధైర్యంగా ఉండండి అని డాక్టర్లు ఇంకెవరికైనా చెబితే కచ్చితంగా నమ్మేస్తారు..కానీ ఇక్కడ పేషంటే ఒక డాక్టర్.. అందువల్ల తన శరీరాన్ని ఆవహించిన క్యాన్సర్ భూతం ఎలా కబళిస్తుందో అంచనా వేయగలిగాడు.. ఇంకా ఎన్నిరోజులు బతుకుతానే అంచనా వేసుకున్నాడు..అయితే రోగం వచ్చిందని ఢీలా పడిపోలేదు..కన్నీళ్లు పెట్టుకుని కుమిలిపోలేదు..చావు నుంచి ఎలాగూ తప్పించుకోలేం అని డిసైడ్ అయిపోయాడు..అందుకే ఉన్న నాలుగురోజులు ధైర్యంగా బతికాడు..తనని నమ్ముకుని ఉన్నవాళ్లని., తనని కన్నవాళ్లని ప్రేమగా చూసుకున్నాడు..ఉన్న నాలుగురోజులు వారితో గడిపాడు..స్నేహితులతో సంతోషంగా తిరిగాడు.. కట్టుకున్న భార్యని విడాకులు ఇచ్చి ఇంకో పెళ్లి చేసుకోమన్నాడు..పెళ్లై అంతాకలిపి పదిరోజులు కూడా కాపురం చేయలేదు. అందుకే తన వల్ల ఆమె జీవితం నాశనం కాకూడదని ఆలోచించాడు.. ఆమెకి తన జబ్బుగురించి వివరించాడు.. ఇక..తల్లిదండ్రులు జీవితమంతా సుఖంగా బతికేలా ఏర్పాట్లు చేశాడు..ఆఖరికి తాను చనిపోయాక ఆస్ట్రేలియా నుంచి తన మృతదేహాన్ని తీసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందీ పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాడు..జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనుకుంటూ నవ్వుతూనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడు
అమ్మా..నాన్నా..నేను చనిపోతున్నా
అమ్మా… నాన్నా… నేను చనిపోతున్నా.. మీరు ధైర్యంగా ఉండండి అని వారిని ఓదార్చాడు. తన మృతదేహాన్ని ఆస్ట్రేలియా నుంచి ఇంటికి తరలించేందుకు తనే ఏర్పాట్లు చేసుకున్నాడు. నమ్మలేకున్నా.. కళ్లు చెమ్మగిల్లే వాస్తవమిది. ప్రాణాం తక వ్యాధి సోకిందని తెలుసుకున్న ఆ యువకుడు కుంగిపోలేదు. తాను చనిపోతానని తెలిసినా మరణాన్ని ధైర్యంగా ఆహ్వానించాలనుకున్నాడు.. నేను ఖచ్చితంగా చనిపోతాను.. నా మృతదేహాన్ని ఇండియాకు తీసుకెళ్లండి అని మరణానికి ముందే ఏర్పాట్లు చేసుకున్న ఖమ్మం యువకుడు.. డాక్టర్ హర్షవర్ధన్-అందుకే ఆస్ట్రేలియాలో తన మరణానంతరం వ్యవహారాలు చూసుకోవడానికి, మృతదేహాన్ని కార్గోలో ఇండియాకు తరలించడానికి ఒక పెద్ద లాయర్ ను ఏర్పాటు చేసుకున్నాడు..చనిపోయేముందు 2022 సెప్టెంబరు లో సొంతూరుకు వచ్చి 15 రోజులు గడిపి వెళ్లారు.
చిన్నప్పటి తన స్నేహితులను కలుసుకున్నాడు..తాను పుట్టి పెరిగిన ఊరు, తన బంధువులు, చదువుకున్న స్కూలు, తనకు పాఠాలు నేర్పిన టీచర్లు అందర్నీ కలుసుకున్నాడు.. ఇక జీవితం ముగిసిపోతోందని తెలిసినా ఎక్కడా ఆ బాధని ముఖంలో తెలీకుండా జాగ్రత్తలు పడ్డాడు…తర్వాత తాను గడిపిన ఆనందపు క్షణాల్ని గుండెల్లో దాచుకుని తిరిగి ఆస్ట్రేలియా వెళ్లాడు.. తర్వాత వ్యాధి మరింత ముదిరిపోయింది..
అయితే వ్యాధి రోజురోజుకూ ఎలా తన ఊపిరితిత్తులను పాడు చేస్తోందో డాక్టర్ గా అర్థం చేసుకున్నాడు.. ఈసారి చికిత్సకు వ్యాధి లొంగదని, మరణం తప్పదని వైద్యులు నిర్ధారించారు. హర్షవర్ధన్ భయపడలేదు. విషయం బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పాడు. తల్లిదండ్రులకు ధైర్యం చెప్పాడు. ఆరోగ్యం క్షీణించడంతో చివరి రోజుల్లో తరచూ బంధువులకు వీడియోకాల్ చేసి మాట్లాడేవాడు. తాను ఎలా ఉన్నానో ప్రతి రోజూ తల్లిదండ్రులకు వీడియో కాల్ లో చెప్పేవాడు.. కొందరు స్నేహితులను ఇంటికి కూడా పిలిపించుకున్నాడు. చికిత్స పొందుతూ మార్చి 24 న హర్షవర్ధన్ చనిపోయాడు.
ఆస్ట్రేలియా నుంచి ఖమ్మంకు నిర్జీవంగా
హర్షవర్ధన్ మృతదేహం బుధవారం ఉదయం ఖమ్మంలోని అతని ఇంటికి చేరింది. తల్లిదండ్రులు అంత్యక్రియలు నిర్వహించారు. అంతాబాగుంటే మే 21న హర్షవర్ధన్ ఇండియా రావాల్సి ఉంది. ఆ నెలలో తమ్ముడు అఖిల్ వివాహం ఉంది. అందరూ సంతోషంగా గడపవచ్చు అనుకున్నారు. కానీ ఇంతలోనే కుమారుడు విగతజీవిగా ఇంటికి రావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుము న్నీరుగా విలపించారు… కుమారుడు మరణం తో తల్లి దండ్రులు,బందువులు కన్నీటి పర్యంతం అవుతున్నారు…
అలా ముగిసింది..
ఒక డాక్టర్ జీవితం అలా ముగిసిపోయింది.. చావు ముంచుకొస్తున్నా..మృత్యువు వెంటాడుతున్నా.. అటు తనని నమ్ముకున్నవాళ్లని.తనని కన్నవాళ్లని, తనని కట్టుకున్నవాళ్లని అందరి గురించి ఆలోచించాడు..అందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయాడు..తాను లేకపోయినా అందరి ముఖాల్లో చిరునవ్వే చూడాలనకున్నాడు.అందుకే బాధ మొత్తాని తన గుండెల్లోనే దాచుకుని అందరికీ సంతోషాన్ని పంచాడు డాక్టర్ హర్షవర్ధన్..
– అశోక్ వేముపల్లి, అసోసియేట్ ఎడిటర్ టీవీ9