Karimnagar Granite Mafia: కరీంనగర్ గ్రానైట్ దందా.. ఈడీ విచారణతో కదిలిన డొంక.. త్వరలో నోటీసులు
కరీంగనర్ జిల్లాలో గ్రానైట్ అక్రమ దందా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తీగ లాగితే, మొత్తం డొంకంతా కదులుతోంది. ఈ అక్రమాలపై న్యాయవాది మహేందర్ రెడ్డి ఫిర్యాదులకు తోడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్..

Karimnagar Granite Mafia: కరీంగనర్ జిల్లాలో గ్రానైట్ అక్రమ దందా వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ తీగ లాగితే, మొత్తం డొంకంతా కదులుతోంది. ఈ అక్రమాలపై న్యాయవాది మహేందర్ రెడ్డి ఫిర్యాదులకు తోడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంతో కేసు విచారణ వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే గ్రానైట్ అక్రమాలపై నోటీసులు, లేఖలు రాసిన ఈడీ, మరో రెండు సంస్థలు, వాటి యజమానులపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో కీలక పదవుల్లో ఉన్న వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఆ సంస్థలకు త్వరలో నోటీసులు జారీచేయనున్నట్టు సమాచారం. బండి సంజయ్ కేంద్ర హోంమంత్రిని కలిసిన ప్రతి సందర్భంలో గ్రానైట్ అక్రమ దందా గురించి చెబుతూ, కీలక ఆధారాలను అందజేసినట్టు తెలుస్తోంది. అయితే బీజేపీ ఎంపీ, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున బండి సంజయ్ ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటే, దీనికి రాజకీయ రంగు పులిమే అవకాశం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భావించినట్టు తెలుస్తోంది. అందుకే ఈ వ్యవహారంపై న్యాయవాది మహేందర్ రెడ్డి నుంచి ఫిర్యాదు అందిన వెంటనే చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే గ్రానైట్ మైనింగ్, రవాణా, ఎగుమతులు చేస్తున్న కంపెనీలకు నోటీసులు ఇవ్వడంతో పాటు ఎగుమతులు జరుగుతున్న పోర్టులకు ఈడీ లేఖలు రాసి, కీలక సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదుదారులు సమర్పించిన ఆధారాలకు తోడు ఈడీ సేకరించిన సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలో 17 చోట్ల గ్రానైట్ మైనింగ్ జరుగుతుండగా, అత్యధికంగా ఉత్తర తెలంగాణలో కరీంనగర్ పరిసరాల్లో ఉన్నాయి. గ్రానైట్ వ్యాపారం చేస్తున్న కంపెనీలు పరిమితిని మించి తవ్వకాలు జరపడం సహా అనేక రకాలుగా మైనింగ్ అక్రమాలు జరిపారని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు నుంచి ఫిర్యాదులున్నాయి. రాష్ట్ర విభజన కంటే ముందు జరిగిన విజిలెన్స్ దాడుల్లోనే కోట్ల రూపాయలు మేర ప్రభుత్వాదాయానికి గండికొట్టినట్టు తేలింది. నిర్దేశించిన పరిమాణాన్ని మించి ఉన్న గ్రానై ట్ బ్లాక్‌లను విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పూర్తిస్థాయి విచారణ జరిపి ఏ సంస్థ వల్ల ఎంత నష్టం జరిగిందో లెక్కించారు. ఆయా కంపెనీలు పాల్పడిన అక్రమాలకు 5 రెట్ల పెనాల్టీ కలిపి మొత్తం రూ.749.66 కోట్లు జరిమానా (సినరేజీ ఫీజు) విధించారు. కానీ ఆ కంపెనీలు జరిమానా చెల్లించకపోగా, అక్రమ వ్యాపారాన్ని యధేచ్ఛగా కొనసాగించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆయా కంపెనీల యజమానులు రాజకీయ పలుకుబడిని ఉపయోగించి పెనాల్టీని ఒక వంతుకు తగ్గించుకున్నారు. ఆ పెనాల్టీని కూడా చెల్లించకుండా రూ.11 కోట్లు చెల్లించి చేతులు దులుపుకున్నారు. న్యాయ వాది మహేందర్‌రెడ్డి ఈ అంశాలన్నీ వివరిస్తూ ఈడీకి ఫిర్యాదు చేశారు. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలు, పద్దుల నిర్వహణపై ప్రత్యేకంగా ఆడిటింగ్ చేస్తే మరిన్ని ఎగవేతలు, అక్రమాలు, భారీగా నల్లధనం వెలుగు లోకి వస్తాయని వివరించారు.
న్యాయవాది మహేందర్ రెడ్డితోపాటు బండి సంజయ్ తదితరులు కూడా గ్రానైట్ అక్రమాల వ్యవహారంపై ఈడీకి వేర్వేరుగా లేఖలు రాయడంతో, ఆ సంస్థ రంగంలోకి దిగింది. కరీంనగర్ నుంచి విదేశాలకు ఎగుమతి చేసిన గ్రానైట్ విషయంగా విచారణ మొదలుపెట్టింది. కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఎంతమేర గ్రానైట్ విదేశాలకు తరలించారు? కంపెనీల వివరాలు, యజమానులు, భాగస్వాముల వివరాలు, ఈమెయిల్ ఐడీలు ఇవ్వాలని ఆదేశించింది. ఈ కంపెనీలకు సంబంధించి ఇతర ఏ డాక్యుమెంట్లు ఉన్నా 10 రోజుల్లోగా పంపాలని కోరింది. ఈడీ ఆదేశాలపై స్పందించిన కంపెనీలు తమ పోర్టుల ద్వారా జరిగిన లావాదేవీలను ఈడీకి సమర్పించినట్టుగా తెలిసింది. ఈ ప్రకారం పరిమితికి మించి బరువున్న గ్రానైట్ బ్లాకులను కూడా ఎగుమతి చేసినట్టు తెలిసింది. ఇప్పటికే ఎగుమతులకు సిద్ధంగా ఉన్న గ్రానైట్ బ్లాకులు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులతో పాటు రాజమండ్రి రైల్వే వ్యాగన్లలో ఉన్నట్లు గుర్తించారు. మరికొంత సమాచారం సేకరించిన అనంతరం ఈడీ సదరు గ్రానైట్ కంపెనీలపై దాడులు జరిపి సోదాలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది.
Also Read: PCOD: అమ్మాయిల ఆరోగ్యంపై కల్తీ ఎఫెక్ట్.. అందుకే చిన్న వయసులోనే..
