AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నలుగురు అమ్మాయిలు ఆటోలోంచి పడ్డారా.. దూకారా? సంగీత మరణానికి కారణమెవరు..

హాస్టల్‌లో ఉండాల్సిన నలుగురు విద్యార్థినిలు ఆటో ఎక్కారు. అయితే ఆటో జర్నీలో ఉండగానే ఒక్కొక్కరుగా కిందపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఓ విద్యార్ధిని మాత్రం తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో జరిగింది ఈ దారుణం.

నలుగురు అమ్మాయిలు ఆటోలోంచి పడ్డారా.. దూకారా? సంగీత మరణానికి కారణమెవరు..
Student Death
Shaik Madar Saheb
|

Updated on: Jan 26, 2026 | 7:05 PM

Share

హాస్టల్‌లో ఉండాల్సిన నలుగురు విద్యార్థినిలు ఆటో ఎక్కారు. అయితే ఆటో జర్నీలో ఉండగానే ఒక్కొక్కరుగా కిందపడ్డారు. వారిలో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఓ విద్యార్ధిని మాత్రం తలకు తీవ్ర గాయం కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. కామారెడ్డి జిల్లా బోర్లం గురుకుల పాఠశాలలో జరిగింది ఈ దారుణం. గురుకుల పాఠశాలలో అసలేం జరిగింది..? విద్యార్ధినులు ఎందుకు ఆటో ఎక్కారు..? ఎలా కింద పడ్డారు..? నిన్నటి నుంచి ట్విస్టులపై ట్విస్టులతో సాగుతున్న సంగీత డెత్‌ మిస్టరీపై అప్‌డేట్స్‌ చూద్దాం..!

నిన్నరాత్రి 7 గంటల 41 నిమిషాల సమయంలో ఓ ఆటో వెళ్తుండగా సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు చూస్తున్నాం. ఆటో వెళ్తుండగా మొదట ఓ విద్యార్ధిని కింద పడింది. కాసేపటికే మరో విద్యార్దిని కిందపడగా..కొన్ని క్షణాల్లోనే మరో విద్యార్ధిని కూడా వాహనం నుండి కింద పడ్డ విజువల్స్ కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలే అనేక అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఈ బాలికలు ఆటోలో నుండి ఎలా కింద పడ్డారు..? ప్రమాదవశాత్తూ కిందపడ్డారా..? లేక కావాలనే కిందకు దూకారా..? ఇప్పుడు దీనిపైనే ఆరా తీస్తున్నారు పోలీసులు.

కదులుతున్న ఆటో నుండి మానస, అంజలి, వైశాలి, సంగీత కిందకు దూకగా.. వారిలో సంగీత తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో చికిత్స కోసం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతురాలు సంగీతది మద్నూర్ మండలం కోడిచెర్ల గ్రామంగా గుర్తించారు.

హాస్టల్‌లో ఉండాల్సిన బాలికలు ఆటో ఎందుకు ఎక్కారు..? దీనిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థిని తల్లిదండ్రులు. పాఠశాల సిబ్బంది బాధ్యతారాహిత్యం వల్లే తమ బిడ్డను కోల్పోయామని తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. విద్యార్ధిని మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

తన ఇంట్లో జరిగిన సత్యనారాయణ స్వామి వ్రతం కోసం..స్కూల్లోని ఫర్నీచర్‌ను ప్రిన్సిపల్‌ సుజాత తీసుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. ఫర్నిచర్‌తో పాటు కొందరు విద్యార్థినుల్ని కూడా ప్రిన్సిపల్‌ తన ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ వ్రతం అయిపోయిన తర్వాత ఫర్నీచర్‌ను వెనక్కి పంపించారు. ఫర్నిచర్‌ను హాస్టల్‌లో దించిన అనంతరం ఆటోలో ఉన్న విద్యార్థినిలు ఒకరితర్వాత ఒకరు దూకినట్టు తెలుస్తోంది. ప్రిన్సిపల్ మాత్రం విద్యార్థినులు ఎందుకు ఆటో ఎక్కారో తనకు తెలియదంటున్నారు.

విద్యార్థిని సంగీత మృతిపై దర్యాప్తు చేస్తు్న్నామని చెబుతున్నారు ACP విఠల్‌రెడ్డి. ఆటో నుండి ఫర్నీచర్ దించాక నలుగురు విద్యార్థినులు ఆటో ఎక్కారని.. డ్రైవర్‌కు తెలియకుండా కిందికి దూకడంతో వారికి గాయాలయ్యాయన్నారు ఏసీపీ.

హాస్టల్‌లో ఉండాల్సిన అమ్మాయిలను ప్రిన్సిపల్‌ ఇంట్లో పనుల కోసం ఎందుకు తీసుకెళ్లారు..? అక్కడి నుంచి తిరిగి వచ్చేప్పుడు ఏం జరిగింది అనేది మిస్టరీగా మారింది. సంగీత మృతికి నిరసనగా గురుకుల పాఠశాల గేట్ ముందు తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. సంగీత మరణానికి కారణమైన ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు.

విద్యార్ధిని మరణం స్థానికంగా చర్చనీయాంశంగా మారడంతో MLA పోచారం శ్రీనివాసరెడ్డి ఏం జరిగిందో ఆరా తీశారు. సమగ్ర విచారణ చేయించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ తరఫున పరిహారం కూడా అందిస్తామన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో స్కూల్ దగ్గర బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. నలుగురు అమ్మాయిలు ఆటోలోంచి తిరిగి వచ్చేప్పుడు ఏం జరిగింది..అనేది తేలాల్సి ఉంది..!