Kadem Project: కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రకృతి సహకరించడంతో ముంచుకొస్తుంది అనుకున్న ముప్పు నుంచి తప్పించుకున్నట్లు అయ్యింది. గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తోన్న వర్షాల కారణంగా నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద నీరు చేరుకున్న విషయం తెలిసిందే. 64 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో వరద నీరు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. వరద నీరు తీవ్రంగా పోటెత్తుండటంతో ప్రాజెక్ట్ మనుగడే ప్రమాదకరంగా మారిందనే అభిప్రాయాలు వెల్లడయ్యాయి. దీంతో కడెం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించారు.
అయితే తాజాగా ప్రకృతి సహకరించడంతో కడెం ప్రాజెక్ట్ ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్ట్‌కు వరద ఇన్‌ఫ్లో తగ్గింది. డ్యామ్‌ను డేంజర్ జోన్ నుంచి కాపాడేందుకు నీటి మట్టాన్ని 680 అడుగులకు తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టారు. ప్రస్తుత ఇన్ ఫ్లో 2,50,000 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,90,000 క్యూసెక్కులుగా ఉంది. ఇన్ ఫ్లో అంటే అవుట్ ఫ్లో పెరగడంతో ప్రాజెక్ట్‌పై క్రమంగా ఒత్తిడి తగ్గుతోంది. కడెం ప్రాజెక్ట్‌కు ప్రమాద ముప్పు తప్పడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..