
తెలంగాణ బీజేపీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కొంతకాలంగా ఆ నాయకులు అస్సలు కలుసుకోవడం లేదు. అంతర్గత కుమ్ములాటలు తీవ్రస్థాయిలో ఉండటంతో డైరెక్ట్‌గా అధిష్ఠానమే రంగంలోకి దిగి సమస్య పరిష్కారానికి కృషి చేస్తోంది. మరి ఎడమొహం, పెడమొహంగా ఉన్న ఈ నేతలు ఇవాళ కలుసుకోబోతున్నారా? బీజేపీలో రెండు వర్గాలుగా చీలిపోయిన ఈటెల, బండి సంజయ్ కలుస్తున్న వేదిక ఏంటి? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నాయి. పార్టీ నేతలు రెండుగా చీలిపోయి బండి సంజయ్ అనుకూల వర్గంగా, వ్యతిరేకవర్గంగా తయారైంది. బండి సంజయ్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఈటల రాజేందర్ మరో గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతల మధ్య మిగతా నాయకులు కూడా చీలిపోయారు. ఇటీవల కాలంలో బండిసంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరూ కూడా ఎదురెదురు పడలేదు.
కొద్దికాలంగా ఈటల రాజేందర్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంతేకాదు ఈటల అసంతృప్తిగా ఉన్నారని తెలిసి పార్టీ అధినాయకత్వం ఢిల్లీకి పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమయంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సభ జరగడంతో ఈ వేదికలో కూడా ఇద్దరు నేతలు కలవలేదు. అయితే ఇప్పుడు నాయకత్వ మార్పుపై బీజేపీలో విస్తృతంగా చర్చ జరుగుతున్న సమయంలో ఈ ఇద్దరు నాయకులపై అందరి దృష్టి పడింది.
ఈనెల 8వ తేదీన వరంగల్‌లో ప్రధాని నరేంద్రమోదీ బహిరంగ సభ ఉంది. బీజేపీ ముఖ్యనాయకులంతా సభ ఏర్పాటు పరిశీలన కోసం వరంగల్ వెళ్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే సన్నాహక సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఎదురెదురు పడబోతున్నారు. దాంతో ఇవాళ జరిగే కార్యక్రమానికి కొంత హైప్ ఏర్పడింది. ఇద్దరు నేతలు ఎదురైతే ఎలా ఉంటుందో చూడాలని కాషాయ కార్యకర్తలతోపాటు మిగతా పార్టీల నేతలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక కొత్త అధ్యక్షుడిగా పేరు వినిపిస్తున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా సన్నాహక సమావేశానికి హాజరవుతున్నారు. ఈ ముగ్గురు నాయకుల కలయిక ఆసక్తిగా మారింది. ఇవాళ హన్మకొండలో జరిగే కార్యక్రమానికి పెద్దయెత్తున బీజేపీ కార్యకర్తలు విచ్చేస్తున్నారు. విభేదాల కాషాయంలో ఏమి జరుగుతుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..