
Nalgonda: నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఆ పార్టీని వీడుతున్నారా? ఆయన త్వరలోనే కాంగ్రెస్ గూటికి చేరుతారా? అంటే స్థానిక నాయకులు అవుననే అంటున్నారు. దానికి సాక్షిగా కాంగ్రెస్ నేతల మధ్య వెలసిన ఆయన ఫోటో ప్లెక్సీని చూపుతున్నారు. అవును.. నార్కట్‌పల్లి మండలం అమ్మనబోలు వద్ద ఏర్పాటు చేసిన పలు ప్లెక్సీలు టీఆర్ఎస్‌లో కలకలం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ నేతల ప్లెక్సీలో టీఆర్ఎస్ నకిరెకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఫోటో ఉండటం తాజా చర్చకు దారి తీసింది. ఆలయ ప్రారంభోత్సవానికి పీసీసీ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి లకు స్వాగతం పలుకుతున్నట్లుగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్లెక్సీలో వేముల వీరేశం ఫోటో కూడా పెట్టారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. కొంతకాలంగా వీరేశం కాంగ్రెస్ గూటికి వెళ్తున్నారంటూ జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటి నేపథ్యంలో తాజా ప్లెక్సీ ఇష్యూతో వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయం అని స్థానిక నేతలు భావిస్తున్నారు.
ఇదిలాఉండగా.. అభిమానం కొద్ది తమ నేత ఫోటోను ప్లెక్సీలో పెట్టుకున్నారని, ఆయన టీఆర్ఎస్‌ను వీడబోరంటూ వీరేశం అనుచరులు చెబుతున్నారు. తమ నాయకుడిపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనకు పెరుగుతున్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని వారే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు వేముల వీరేశం కాంగ్రెస్‌లో చేరే ఛాన్సెస్ ఉన్నాయంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు సైతం చెవులు కొరుక్కుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ప్లెక్సీ వెలిసిందని చెబుతున్నారు. మరి వారు అలా, వీరు ఇలా అభిప్రాయపడుతున్న నేపథ్యంలో.. వేముల వీరేశం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై కాలమే సమాధానం చెబుతుంది. ఎందుకంటే.. రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో ఎవరూ ఊహించలేరు కదా మరి!