Hyderabad: ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య .. కార్బన్ మోనాక్సైడ్ పీల్చి..!
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

షాకింగ్ న్యూస్.. ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని పేరు సంపాదించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్నారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె సూసైడ్ చేసుకున్నారు. ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిన గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె ఎలక్ట్రికల్ గ్రిల్‌లో కార్బన్ మోనాక్సైడ్ కెమికల్ వేసి.. అనంతరం ఆ పొగ పీల్చి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. స్పాట్‌లో అన్ని ఆధారాలు సేకరించారు. ఆపై మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా గత కొంతకాలంగా ప్రత్యూష డిప్రెషన్‌లో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యూషకు మంచి పేరు ఉంది. శృతి హాసన్, దీపికా పదుకొణె, రకుల్ ప్రీత్‌సింగ్, ప్రణీత, ఛార్మి, త్రిష, నిహారిక వంటి ప్రముఖ సినీతారలకు ప్రత్యూష డ్రెస్సులు డిజైన్ చేశారు. అనేక మంది సెలబ్రిటీలు ప్రత్యూష వర్క్స్‌ను ఎండార్స్ చేశారు. సౌత్ ఇండియాలో ఆల్ మోస్ట్ హీరోయిన్లందరికీ ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. బాలీవుడ్ తారలు అనేక మంది తమ డ్రస్సుల కోసం ప్రత్యూషను ఫ్రిఫర్ చేసేవారు. కొంత మంది హీరోలకు కూడా ఈమె డ్రెస్సులు డిజైన్ చేశారు. తన పేరునే లేబుల్ అండ్ బ్రాండ్ నేమ్‌గా మార్చేసి, ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రశ్రేణి డిజైనర్‌గా ఎదిగి, అర్ధాంతరంగా వెళ్లిపోయింది ప్రత్యూష.
భిన్నంగా ఆలోచించే ప్రత్యూషకు చిన్ననాటి నుంచే ఫ్యాషన్, డిజైన్ అంటే ఆసక్తి. కాని ఏనాడు ఆ రంగాన్ని తన కెరీర్‌గా ఆమె ఆలోచించలేదు. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వార్విక్ నుంచి మాస్టర్ డిగ్రీ చేసిన ప్రత్యూష తొలుత తన తండ్రికి చెందిన LED తయారీ వ్యాపారంలో అడుగుపెట్టారు. కాని అది తన రంగం కాదని గుర్తించిన ఆమె ఫ్యాషన్ ప్రపంచంలోకి ప్రవేశించారు. సొంతంగా తన పేరుతోనే లేబుల్ క్రియేట్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో అగ్రశ్రేణి డిజైనర్‌గా నిలిచారు. 2013లో ఈ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టిన ప్రత్యూషకు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఏనాడు ఏర్పడలేదు. ఎంతో పేరున్న ప్రత్యూష ఎందుకు ఆత్మహత్య చేసుకుందో అర్థం కావడం లేదు.




