Amit Shah: తెలంగాణలో పక్కాగా ఫ్లాన్.. టార్గెట్ డబుల్ డిజిట్.. రంగంలోకి దిగిన అమిత్ షా
2024 పార్లమెంట్ ఎన్నికల వ్యూహాలపై భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. కర్ణాటక తర్వాత దక్షిణ భారతదేశంలో ఆ పార్టీకి కీలకంగా మారిన తెలంగాణపై గురిపెట్టింది కాషాయ దళం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోయినా.. పార్లమెంట్‌లో డబుల్ డిజిట్‌తో సత్తా చాటాలనుకుంటోంది బీజేపీ.
తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్‌పై అమిత్ షా సీరియస్ అయ్యారు. ఎవ్వరూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని ఆదేశించారు. అందరు కలిసికట్టుగా పనిచేస్తే పార్లమెంటు ఎన్నికల్లో మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. సిట్టింగ్ ఎంపీలు తమ తమ స్థానాల నుంచి పోటీకి సిద్ధం కావాలంటూ సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత పాతబస్తీ లోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని అమిత్ షా సందర్శించారు. అనంతరం కొంగర కలాన్‌లో పార్టీ నేతలతో ఆయన భేటీ అయ్యారు.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, 2024 లోక్‌సభ ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం తెలంగాణలో ఒకరోజు పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్‌లో భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారు. ఆ తర్వాత స్లోఖా సదస్సులో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బీజేపీ మండల అధ్యక్షులతో సమావేశమయ్యారు. తెలంగాణకు బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ అమిత్ షా అధ్యక్షతన శంషాబాద్‌లో సంస్థాగత సమావేశం నిర్వహించారు.
2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 సీట్లలో నాలుగు స్థానాలను కాషాయ పార్టీ గెలుచుకుంది. ఈ సారి ఎన్నికల్లో 10 లోక్‌సభ స్థానాలే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఫ్లాన్‌తో ముందుకు వెళ్ళాలని భావిస్తోంది. దేశంలో మూడోసారి అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా నియమితులయ్యారు. పార్టీ ఎన్నికలలో వెనుకబడిన రాష్ట్రాల్లో సత్తా చాటేందుకు పక్కా వ్యుహంతో వెళ్తున్నారు అమిత్ షా.
తెలంగాణలో ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో, బీజేపీ తన ఓట్ల వాటాను రెట్టింపు చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 8 అసెంబ్లీ స్థానాలను దక్కించుకుంది. గత ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక సీటును గెలుచుకుంది. అయితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్ల వాటాలో 7 శాతం సాధించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…