Hyderabad: భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల రీసైక్లింగ్ కు మరో రెండు ప్లాంట్లు..

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణ, కూల్చివేసిన వ్యర్థాలను రీసైకిల్ చేసే మరో రెండు ప్లాంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి.

Hyderabad: భవన నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల రీసైక్లింగ్ కు మరో రెండు ప్లాంట్లు..
Hyderabad
Follow us

|

Updated on: Jul 07, 2022 | 5:32 PM

Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో భవన నిర్మాణ, కూల్చివేసిన వ్యర్థాలను రీసైకిల్ చేసే మరో రెండు ప్లాంట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. బిల్డింగ్స్ వ్యర్థాలతో నగరంలో ఏర్పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పటికే ఉన్న రెండు ప్లాంట్లకు తోడు మరో రెండు నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ భవన నిర్మాణ వ్యర్థాలు సిటీలో అనుమతిలేని చోట్ల, ఎక్కడపడితే అక్కడ రోడ్ల పక్కన, నాలాల్లో వేయడంతో ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా వ్యర్థాలను రోడ్డు మీద, ఫుట్ పాత్, నాలా, చెరువులో వేయడంతో ముంపు ప్రభావం, వాతావరణ కాలుష్యం సహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీన్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ మరో రెండు సీ అండ్ డీ ప్రాసెసింగ్ ప్లాంట్ లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది.

ఇప్పటికే జీడిమెట్ల, ఫతుల్లగూడలలో సీ అండ్ డీ ప్లాంట్లు ఏర్పాటు చేసి అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. అక్కడ రోజుకు ఒక్కొక్క ప్లాంట్ సుమారు 500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ప్రాసెస్ చేస్తున్నాయి. కొత్తగా సికింద్రాబాద్, చార్మినార్ వైపు మరో 15 సర్కిళ్లలో కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాలను ప్రాసెస్ చేయాలని భావించింది. అందుకు జీహెచ్ఎంసీ టెండర్ గతంలోనే టెండర్ పిలిచింది. ప్లాంట్ ఏర్పాటుకు నగరానికి 10 కిలోమీటర్ల దూరం, 5 ఎకరాలకు పైబడి సొంత భూమి ఉండాలని ఆ టెండర్లలో పొందుపరిచింది. నిబంధనల మేరకు రెండు ప్లాంట్ లు ఒకే ఏజెన్సీకి దక్కాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపించారు. గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే ఆ ఏజెన్సీతో జీహెచ్ఎంసీ MOU కుదర్చుకోనుంది. ఒప్పందం చేసుకున్న తర్వాత ఏడాదిలో ప్రాసెసింగ్ ప్లాంట్ లను ఏర్పాటు చేయనున్నారు. అప్పటివరకు కేటాయించిన సర్కిల్ లలో వ్యర్ధాలను తప్పనిసరిగా సేకరించాల్సి ఉంటుంది. కూల్చివేసిన, భవన నిర్మాణ వ్యర్థాలు అనుమతి లేని చోట రోడ్డు మీద, ఫుట్ పాత్, నాలా, చెరువు లలో వేస్తే జరిమానాతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకోనున్నారు.

ఈ నేపథ్యంలో చార్మినార్, సికింద్రాబాద్ వైపు ఏర్పాటు చేసే ప్రాసెసింగ్ ప్లాంట్ ను రెండు ప్యాకేజీలుగా విభజించారు. ప్యాకేజీ 1 కింద చార్మినార్ వైపు ఏర్పాటు చేసే ప్లాంట్ కు 8 సర్కిళ్లను కేటాయించారు. చాంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా, రాజేంద్రనగర్, మెహిదీపట్నం, కార్వాన్, గోషామహల్, జూబ్లీహిల్స్. 2వ ప్యాకేజీ ద్వారా సికింద్రాబాద్ వైపు ప్లాంట్ కి మరో 7 సర్కిళ్లను కేటాయించారు. కాప్రా, ముషీరాబాద్, ఖైరతాబాద్, అల్వాల్, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, బేగంపేట్ సర్కిళ్లలో వ్యర్థాలు సేకరణ చేస్తారు. సికింద్రాబాద్, చార్మినార్ వైపు ఈ రెండు సీ అండ్ డీ ప్లాంట్లు అందుబాటులోకి వస్తే నగరంలో మొత్తం నాలుగు ప్లాంట్లలో కలిపి రోజుకి దాదాపు 2 వేల మెట్రిక్ టన్నుల భవన నిర్మాణ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయనున్నారు. దీంతో ఎక్కడికక్కడ పేరుకుపోయే భవన నిర్మాణ వేస్టేజ్ తగ్గిపోనుంది.

 – విద్యాసాగర్, టీవీ9 తెలుగు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..