Weather: కూల్ న్యూస్.. తెలంగాణలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శని, ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కురిసే చాన్స్ ఉందని వెల్లడించింది. వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఉరుముల, మెరుపులు, తీవ్ర గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. హైదరాబాద్ విషయానికొస్తే, ఏప్రిల్ 16 వరకు నగరంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని IMD తెలిపింది. వచ్చే బుధవారం వరకు ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఉంటాయని అంచనా వేసింది. కాగా శుక్రవారం హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో అత్యధికంగా 39.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా 43.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో రికార్డయింది. అంచనా వేసిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, వాతావరణ శాఖ ఏప్రిల్ 14 వరకు తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. రెయిన్ అలెర్ట్ నేపథ్యంలో.. రాబోయే 2, 3 రోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుతాయని భావిస్తున్నారు. అంటే 3 రోజులపాటూ.. చెదురు మదురుగా తెలంగాణలో వర్షాలు పడుతూనే ఉంటాయని అధికారులు తెలిపారు.
అకస్మాతుగా పిడుగులతో పడే వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మిర్చి, వరి, మొక్కజొన్న, మామిడి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..