తాను కార్పొరేటర్ నుంచే కేంద్రమంత్రి స్థాయికి వచ్చానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాను బతికినన్నాళ్లు ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతంతో పనిచేస్తానని, ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం ఎందాకైనా పోరాడతానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కరీంనగర్ లోని కాపువాడకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు మున్నూరుకాపులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ స్మార్ట్ సిటీకి నిధులు తీసుకొస్తానని, కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటానని తెలిపారు.కరీంనగర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు.
కేంద్ర మంత్రిగా కరీంనగర్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశారు. పదవి ఉన్నా లేకున్నా మంచి పనులు చేస్తానన్న సంజయ్, వందేళ్లు బతకాలని కోరుకోవడం లేదన్నారు. బతికినన్నాళ్లు ధైర్యంగా, నిజాయితీగా ఉండి పోరాడతానన్నారు. ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తానన్నారు. గతంలో గుండెపోటు రావడంతో ఎన్ని షాక్ లు ఇచ్చినా స్పృహ రాకపోవడంతో చనిపోయానని డాక్టర్లు ప్రకటించారని, మహాశక్తి అమ్మవారి దయవల్ల బతికానన్నారు. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజలకే అంకితం చేశానని బండి సంజయ్ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నానన్నారు.
నేను ధర్మం కోసం, ప్రజల కోసం ఎంత దాకనైనా పోరాడేతానన్న సంజయ్, తనపై 109 కేసులు పెట్టిన భయపడలేదన్నారు. తనను క్రిమినల్ గా మార్చాలనుకుంటే.. ప్రధానమంత్రి మోదీ, అమిత్ షాలు తనను హోం శాఖ సహాయ మంత్రిని చేశారని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా 150 రోజులపాటు మండుటెండలో, చలిలో, వానలో 1600 కి.మీల దూరం పాదయాత్ర చేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎంత ఇబ్బంది పెట్టినా, హేళన చేసినా, ఆఫీస్ పై దాడి చేసినా, అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు చొరబడి లాక్కెళ్లినా, అరెస్ట్ చేసినా, జైల్లో వేసినా భయపడలేదన్నారు. జనం కోసం పోరాడిన. ఈ స్థాయిలో ఉన్నా. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే గుర్తింపు దానంతటే అదే వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు బండి సంజయ్ కుమార్.
అందరం కలిసిమెలిసి ఉండాలే తప్పా, ఒకరినొకరు తిట్టుకుంటూ ఒకరి కాళ్లు ఒకరు గుంజుకోవడంవల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నా భార్యను చంపుతామన్నారు. కొడుకులను కిడ్నాప్ చేస్తామన్నా భయపడలేదన్నారు సంజయ్. ధర్మం కోసం చావడానికైనా సిద్ధం. వెనుకాడ ప్రసక్తే లేదన్న సంజయ్.. ఏనాడూ ఎమ్మెల్యే, ఎంపీ కావాలనుకోలేదన్నారు. కార్పొరేటర్ గా పోటీ చేసిన. ఎమ్మెల్యేగా పోటీ చేసిన. ఎంపీగా గెలిచిన. కేంద్ర హోంశాఖ నా పూర్వజన్మ సుకృతమన్నారు. కేంద్ర మంత్రిగా రాబోయే ఐదేళ్లపాటు అధిక నిధులు తీసుకొచ్చే అవకాశం వచ్చిందన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…