చనిపోయిన ప్రియుడు కలలోకి వచ్చి పిలుస్తున్నాడు.. యువతి దారుణ నిర్ణయం!
ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనే బాధను తట్టుకోలేక, అతడు లేని లోకంలో ఉండలేనంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. చనిపోయిన ప్రియుడు నిరంతరం కలలోకి వచ్చి తనను రమ్మని పిలుస్తున్నాడని చెబుతూ ఆ యువతి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రేమించిన వ్యక్తి దూరమయ్యాడనే బాధను తట్టుకోలేక, అతడు లేని లోకంలో ఉండలేనంటూ ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన హృదయవిదారక సంఘటన శంషాబాద్ పరిధిలో చోటుచేసుకుంది. చనిపోయిన ప్రియుడు నిరంతరం కలలోకి వచ్చి తనను రమ్మని పిలుస్తున్నాడని చెబుతూ ఆ యువతి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధార్థ కాలనీకి చెందిన నర్మద అనే యువతి, నిజామాబాద్ జిల్లాకు చెందిన సిద్ధార్థ్ అనే యువకుడితో కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్న క్రమంలోనే ఊహించని విషాదం ఎదురైంది. ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో సిద్ధార్థ్ దుర్మరణం చెందాడు.
ప్రేమించిన సిద్ధార్థ్ హఠాన్మరణాన్ని నర్మద జీర్ణించుకోలేకపోయింది. అప్పటి నుంచి తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. సిద్ధార్థ్ లేని లోకంలో నేను ఉండలేను అంటూ కుటుంబ సభ్యుల వద్ద తరచూ ఆవేదన వ్యక్తం చేసేది. అంతేకాకుండా, సిద్ధార్థ్ తన కలలోకి వచ్చి రోజూ తనను రమ్మని పిలుస్తున్నాడని తన సోదరికి చెబుతూ రోజూ కన్నీరుమున్నీరయ్యేది.
ఈ క్రమంలోనే మానసిక వేదనను భరించలేకపోయిన నర్మద, ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయాన్ని చూసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కంటిముందే కూతురు అచేతనంగా వేలాడుతుండటం చూసి బోరున విలపించారు.
ప్రియుడు సిద్ధార్థ్ మరణాన్ని తట్టుకోలేకనే తన కూతురు నర్మద ఈ తీవ్ర నిర్ణయం తీసుకుని ఆత్మహత్య చేసుకుందని తండ్రి శంషాబాద్ ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కళ్లముందే ఎదిగొచ్చిన కూతురు ప్రేమించినవాడి కోసం ప్రాణాలు తీసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి. ఈ ఘటన సిద్ధార్థ కాలనీ పరిసర ప్రాంతాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.




