Telangana Rains: మరోసారి అత్యంత భారీ వర్షాలు.. ఆదివారం నుంచి కుంభవృష్టికి ఛాన్స్.. వాతావరణశాఖ వార్నింగ్
గత నెలలో భారీ వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు (Telangana) మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని...
గత నెలలో భారీ వర్షాలకు అతలాకుతలమైన తెలంగాణకు (Telangana) మరోసారి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. అంతే కాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లు వేగంతో వీస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 7 నుంచి 9 వరకు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. ఏడో తేదీన 12 సెంటీమీటర్లు నుంచి 20 సెంటీమీటర్లు వరకు, 8, 9 తేదీల్లో 20 సెంటీమీటర్లు పైనే వర్షపాతం (Rains) నమోదవుతుందని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలకు సమాచారం అందించామని తెలిపారు. కాగా.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ఏపీ కోస్తా తీర ప్రాంతాల్లో కొనసాగుతోంది. దీనితో పాటు విదర్భ నుంచి తెలంగాణ వరకు సగటు 0.9 కిలోమీటర్ల ఎత్తున ద్రోణి కొనసాగుతోంది. ఈ క్రమంలో 7వ తేదీ లేదా ఆ తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. తద్వారా రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కుంభవృష్టి వర్షాలు కురవనున్నాయి.
కాగా.. శుక్రవారం హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ద్రోణి ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లోని షాపూర్‌నగర్‌లో అత్యధికంగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేరెడుమెట్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్, షేక్‌పేట, బహుదూర్‌పురా, రాజేంద్రనగర్, కేపీహెచ్‌బి సీబీసీఐడి కాలనీ, జగద్గిరిగుట్ట, మచ్చబొల్లారం, జూబ్లీహిల్స్, అల్వాల్, మియాపూర్, హస్తినాపురంలో వర్షం కురిసింది.
కాగా.. గత నెలలో కురిసిన కుంభవృష్టికి తెలంగాణ చిగురుటాకులా వణికింది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో కురిసిన వానలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. గత 36 ఏళ్లల్లో ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి భద్రాద్రి జిల్లా వరకు పరివాహక ప్రాంతాలను వరదతో ముంచెత్తింది. మంచిర్యాల, మంథని, భద్రాచలం, కూనవరం లో వరద పోటెత్తింది. భద్రాచలం పట్టణాన్ని వరద ముంచేసింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. గోదావరి ప్రవాహం 70 అడుగులు దాటింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..