Telangana: ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రంలో ప్రారంభమైన ‘ఎక్స్‌ప్రెస్ పార్సిల్’ సేవలు.. పూర్తి వివరాలివే..

|

Jan 27, 2023 | 5:09 PM

తెలంగాణ వాసులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది. టీఎస్ఆర్‌టీసీ వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో నూతనంగా..

Telangana: ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రాష్ట్రంలో ప్రారంభమైన ‘ఎక్స్‌ప్రెస్ పార్సిల్’ సేవలు.. పూర్తి వివరాలివే..
Tsrtc Introducing Fast Parcel Service
Follow us on

తెలంగాణ వాసులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త తెలిపింది. టీఎస్ఆర్‌టీసీ వినియోగదారులకు మరింత వేగవంతమైన సేవలందించేందుకు ‘AM 2 PM’ పేరుతో నూతనంగా ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌‌ను తీసుకొచ్చింది ఆ సంస్థ. శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌ భవన్‌లో ఈ సేవల్ని సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌ లాంఛనంగా ప్రారంభించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులతో కలిసి ‘AM 2 PM’ సర్వీస్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రయాణికుల టికెట్‌ ఆదాయంతో పాటు ప్రత్యామ్నాయ ఆదాయంపై సంస్థ దృష్టి పెట్టిందని, అందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్‌ బంక్‌ల నిర్వహణ, లాజిస్టిక్‌తో పాటు స్వచ్ఛమైన జీవా వాటర్‌ బాటిళ్లను మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకువచ్చామని ఎండీ సజ్జనర్‌ తెలిపారు. లాజిస్టిక్స్‌ (కార్గో) సేవలు ద్వారా సత్ఫలితాలు వస్తున్నాయని, ఆ సేవలను వినియోగదారులకు మరింత వేగంగా, సురక్షితంగా అందించాలనే ఉద్దేశంతో ‘AM 2 PM’ సర్వీస్‌ను ప్రారంభించామన్నారు.

‘ఎక్స్‌ప్రెస్ పార్సిల్ సర్వీస్‌’లను ప్రారంభిస్తున్న టీఎస్ఆర్‌టీసీ ఎండీ సజ్జనార్

ఇదే క్రమంలో హైదరాబాద్‌ సహా తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నేటి నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు సజ్జనార్. ‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌లో మధ్యాహ్నం 12 గంటల్లోపు బుక్ చేస్తే అదే రోజు రాత్రి 9 గంటలకు ఆ పార్శిల్ గమ్యస్థానానికి చేరుతుందని తెలిపారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 గంటల మధ్యలో బుక్‌ చేస్తే మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తుందని పేర్కొన్నారు. ఈ సర్వీస్‌ పరిధిలోకి ఒక కేజీ పార్శిళ్లే వస్తాయని, వాటి విలువ రూ.5 వేలకు మించకూడదని స్పష్టం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ కొరియర్‌ ధర రూ.99గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలిపారు. నగదు, యూపీఐ పేమెంట్స్‌ రూపంలో ఈ సేవలను పొందవవచ్చని వివరించారు. తెలంగాణలోని 99 ప్రాంతాల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని పేర్కొన్నారు. ‘AM 2 PM’ ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్‌ సర్వీస్‌కు సంబంధించిన పూర్తి వివరాలకు 9154680020 ఫోన్‌ నంబర్‌ను కానీ, టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ విభాగ అధికారిక వెబ్‌సైట్‌ www.tsrtcparcel.in ను సంప్రదించాలని సూచించారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్‌ నాటికి 37.21 లక్షల పార్శిళ్లను బట్వాడా చేశామని, వాటి ద్వారా రూ.68 కోట్ల ఆదాయం సంస్థకు సమకూరిందని తెలిపారు. ఈ ఆర్థిక ఏడాదికి కార్గో ద్వారా రూ.100 కోట్లను లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రస్తుతం ప్రతి రోజు 14 వేల పార్శిళ్లను లాజిస్టిక్స్‌ విభాగం గమ్యస్థానాలకు చేర్చుతోందని, ఇప్పటివరకు 1.7 కోట్ల పార్శిళ్లను బట్వాడ చేసినట్లు గుర్తుచేశారు. త్వరలోనే AM 2 PM ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ను ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తామని తెలిపారు. 5 కిలోల లోపు పార్శిళ్లను తిరుపతి, బెంగళూరు, కర్నూలు, విజయవాడ, తదితర నగరాలకు చేరవేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రారంభోత్సవంలో టీఎస్‌ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌, బిజినెస్‌ హెడ్‌ టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్‌ పి.సంతోష్‌కుమార్‌, సీఎఫ్‌ఎం విజయపుష్ఫ, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్‌, సీసీఓఎస్‌ విజయభాస్కర్‌, కార్గో బిజినెస్‌ కన్సల్టెంట్‌లు శ్రవణ్‌ మడప్‌, కపిల్‌ వెనుకంటి, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..