ప్రయాణికులకు షాక్.. టీఎస్‌ఆర్టీసీలో సమ్మె సైరన్!
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ అటు ప్రభుత్వం గానీ ఇటు యాజమాన్యం గానీ సరిగ్గా స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లేబర్ కమిషనర్‌తో మొక్కుబడిగా చర్చలు జరపడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తెలంగాణాలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా సీజన్లలో […]
దసరా పండుగకు ముందు తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆర్టీసీ యూనియన్లు అక్టోబర్ 5 నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చినప్పటికీ అటు ప్రభుత్వం గానీ ఇటు యాజమాన్యం గానీ సరిగ్గా స్పందించకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. లేబర్ కమిషనర్‌తో మొక్కుబడిగా చర్చలు జరపడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి.
తెలంగాణాలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ, దసరా సీజన్లలో ఆర్టీసీ సమ్మెకు పిలుపును ఇవ్వడం గమనార్హం. సెలవులకు గ్రామాలకు పయనమైన ప్రజలు ఈ సమ్మె వల్ల తీవ్ర ఇబ్బందులకు గురి కాక తప్పదనేలా కనిపిస్తోంది. ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి కారణం ప్రభుత్వమేనని.. తాము చర్చలకు సిద్ధంగా ఉన్నా.. ప్రభుత్వ వైఖరి కారణంగా సమ్మెకు దిగాల్సి వస్తోందని కార్మిక నేతలు చెబుతున్నారు. ఆర్టీసీలోని అన్ని సంఘాలు 25 డిమాండ్లతో సమ్మెకు నోటీసులు ఇచ్చాయని వారు అన్నారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు తెలపాలని ఆర్టీసీ సంఘాల నేతలు కోరారు. సెక్యూరిటీ, పారామెడికల్ విభాగాలు మినహా మిగతా అన్ని విభాగాల కార్మికులు సమ్మెలో పాల్గొంటారని వారు చెబుతున్నారు.