Lock Down In Telangana: తెలంగాణలో కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. తొలుత నైట్ కర్ఫ్యూ విధించినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో చివరికి లాక్‌డౌన్ విధించాల్సి వచ్చింది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేయాలంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోలీసు అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారు. ప్రజలు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులకు సహకరిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వులును తూచా తప్పకుండా పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజా ప్రతినిధులు కట్టు తప్పుతున్నారు. అధికార పార్టీకి చెందిన నేతలే ఇష్టా రీతిన వ్యవహరిస్తూ లాక్‌డౌన్ నిబంధలను ఉల్లంఘిస్తున్నారు. దాంతో వీరి చర్య పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. కరోనా నియంత్రణకు సహకరించాలని ఇటు ప్రభుత్వం, ఆటు వైద్యులు ఎంత చెప్పినా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వినపడినట్లుగా లేదు. నలుగురికి చెప్పాల్సిన ఎమ్మెల్యేనే లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశారు. లాక్‌డౌన్ కారణంగా శుభ, అశుభ కార్యక్రమాలు వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. తప్పనిసరి అయితే కొద్ది మంది అతిధుల మధ్య జరుపుకోవాలని లాక్‌డౌన్ మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
అయితే తాజాగా బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రవీందర్‌రెడ్డి 100 మందితో జన్మదిన వేడుకలు నిర్వహించారు. సోషల్ డిస్టెన్స్ పాటించకుండా గుంపులు గుంపులుగా టపాసులు పేలుస్తూ నిర్వహించిన వేడుకలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ.. కొవిడ్ రూల్స్ బ్రేక్ చేయడంపై బాలానగర్ ఏసీపీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Also read:
మీ బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ చేసుకున్నారా ? లేకపోతే.. మీరు రూ. 2 లక్షలు రానట్లే.. ఎలాగో తెలుసా..