Telangana: బస్సులో కండక్టర్‌కు కనిపించిన నల్లటి బ్యాగ్.. ఏముందా అని ఓపెన్ చేయగా
మాములుగా మనం ఎక్కడైనా ప్రయాణించేటప్పుడు.. బస్సులో బ్యాగ్ లేదా ఏదైనా వస్తువు మర్చిపోతే.. అవి మనకు తిరిగి దొరకడం చాలా కష్టం. అయితే టీజీఎస్‌ఆర్టీసీ సిబ్బంది మాత్రం తమ నిజాయితీని చాటుకున్నారు. ప్రయాణీకులు మర్చిపోయిన బ్యాగులను తిరిగిచ్చి.. తమ మంచి మనసును చాటుకున్నారు.

విధి నిర్వహణలో టీజీఎస్ఆర్టీసీ సిబ్బంది తమ నిజాయితీని నిరూపించుకున్నారు. బస్సుల్లో పొగొట్టుకున్న రూ.19 లక్షల విలువైన వస్తువులతో కూడిన బ్యాగ్‌లను ప్రయాణికులకు అందజేిసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ నెల 25న సూర్యాపేట-హైదరాబాద్ మార్గంలో వెళ్తోన్న బస్సులో ఒక ప్రయాణికురాలు తన బ్యాగ్‌ను మరిచిపోయారు. బస్సు సూర్యాపేట బస్ స్టేషన్‌కు చేరుకోగానే ఆ బ్యాగ్‌ను కండక్టర్ కె.అంజయ్య, డ్రైవర్ యాకుబ్ పాషా గుర్తించారు. అందులో రూ.6 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ ఉన్నాయి. వెంటనే వారు బ్యాగ్‌ను సూర్యాపేట డిపోలో అప్పగించారు. ఆర్టీసీ అధికారుల సమక్షంలో ఆ బ్యాగ్‌ను ప్రయాణికురాలికి అందజేశారు.
ఇంకొక ఘటనలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ పుష్పక్ బస్సులో ఒక ప్రయాణికురాలు రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో కూడిన బ్యాగ్‌ను మరిచిపోయారు. ఈ నెల 15న బస్సు ఎయిర్‌పోర్ట్ నుంచి లింగపల్లికి వస్తుండగా అల్విన్ క్రాస్ రోడ్ వద్ద ఆ బ్యాగ్‌ను డ్రైవర్ ముబిన్ గుర్తించారు. దానిని మియాపూర్-2 డిపో అధికారులకు హ్యాండోవర్ చేశారు. మరోక ఎయిర్‌పోర్ట్ బస్సులో శిల్పారామం వద్ద ఒక ప్రయాణికుడు బ్యాగ్‌ను మరిచిపోయారు. అందులో రూ.3.50 లక్షల నగదు, 2 బంగారు గాజులు, ఒక ల్యాప్‌టాప్.. మొత్తం 5 లక్షల విలువైన వస్తువులు ఉన్నాయి. దానిని డ్రైవర్ రమేశ్ గుర్తించి.. అధికారుల సమక్షంలో ప్రయాణికుడికి అందజేశారు. ఈ నెల 25న జరిగిందీ ఘటన.
మానవత్వం చాటుకున్న సూర్యాపేట, మియాపూర్-2 డిపోలకు చెందిన సిబ్బంది కె.అంజయ్య, డ్రైవర్లు యాకుబ్ పాషా, ముబీన్, రమేశ్‌ను టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్ అభినందించారు. వారందరినీ హైదరాబాద్ బస్ భవన్‌కు పిలుపించుకుని ఉన్నతాధికారులతో కలిసి ఆయన సన్మానించారు. మూడు వేర్వేరు ఘటనల్లో ప్రయాణికులు పొగొట్టుకున్న రూ. 19 లక్షల విలువైన బ్యాగ్ లను ప్రయాణికులకు అందజేయడం ఆర్టీసీ సిబ్బంది నిజాయితీకి నిదర్శమన్నారు. ఆర్టీసీ సిబ్బంది ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే సేవాభావం కలిగి ఉండటం గొప్పవిషయమని కొనియాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




