TGSRTC: రూట్ మార్చిన టీజీఎస్‌ఆర్టీసీ.. ఇక కాసుల వర్షం కురవాల్సిందే
మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎస్ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెలవారీగా వస్తున్న మహాలక్ష్మీ టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి పెట్టింది. ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారు.

మహాలక్ష్మీ పథకం వచ్చిన తర్వాత సంక్షోభంలో ఉన్న టీఎస్ఆర్టీసీ క్రమక్రమంగా లాభాల బాటలోకి వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి నెలవారీగా వస్తున్న మహాలక్ష్మీ టికెట్ ఆదాయమే కాకుండా అదనపు ఆదాయంపై దృష్టి పెట్టింది. ఆర్టీసీలో ఇప్పటివరకు మహిళలు 237 కోట్ల జీరో టికెట్ ఉపయోగించుకున్నారు. 7980 కోట్ల రూపాయలు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. టికెట్ ఆదాయంతో పాటు టికెట్ యేతర ఆదాయంపై ఆర్టీసీ ఫోకస్ చేసింది. ఆర్టీసీ బస్సులు, బస్ స్టేషన్‌లలో.. అలాగే టీమ్ మిషన్‌ల ద్వారా వచ్చే టికెట్‌పై అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ఆదాయాన్ని మరింత పెంచాలని ఆలోచిస్తోంది.
ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న తాండూరు, వికారాబాద్, బీహెచ్ఈఎల్, మియాపూర్, కుషాయిగూడ, దిల్‌సుఖ్‌నగర్, హకీంపేట్, రాణిగంజ్, మిథానితో పాటు పలు డిపోలు నష్టాల బారిన ఉండడానికి గల కారణాలు, స్థానిక పరిస్థితులు ఆయా డిపోలు లాభాల బాట పట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ప్రయాణికులకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచుకునేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఇప్పటికే 500 వరకు ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నందున పీఎం ఈ -డ్రైవ్ కింద హైదరాబాద్‌కి కేటాయించిన 2 వేల బస్సులు విడతల వారీగా రానుండడంతో అందుకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్లు మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలో పెరుగుతున్న కొత్త కాలనీలకు, నగరానికి సంబంధించిన వారు ఉదాహరణకు కొల్లూరు వద్ద డబుల్ బెడ్రూం ల వద్ద నివసిస్తున్న వేలాది మందికి రవాణా సౌకర్యాలు కల్పించడానికి డిమాండ్‌కు అనుగుణంగా కొత్త రూట్‌లలో బస్సులు నడిపించేలా స్థానిక డీఎం ఇతర ఆర్టీసీ అధికారులతో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఒక నివేదికను రూపొందించి బస్సులు నడిపేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 578 బస్సులు కొత్తగా రాష్ట్రంలో రోడ్డెక్కాయి. త్వరలో మరిన్ని కొత్త బస్సులు రానుండడంతో వాటిని ప్రయాణికుల ట్రాఫిక్ ఎక్కువగా ప్రాంతాల్లో నడిపించాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ఫోర్త్ సిటీలో బస్ టెర్మినల్ నిర్మాణం, బస్ సౌకర్యాలపై ఆర్టీసీ ఉన్నతాధికారులు అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. నగరంలో పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా కొత్త డిపోలకు అవసరమైన స్థల పరిశీలన చేసి జిల్లా కలెక్టర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి అందించాలని తెలిపారు. నగరంలో నలువైపుల బస్ స్టేషన్‌లు ఉండేలా జేబీఎస్ మాదిరి ఆరంఘర్‌లో అధునాతన బస్సు టెర్మినల్ నిర్మించడానికి ఆర్టీసీ, పోలీస్ శాఖకు సంబంధించిన భూ బదలాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉప్పల్‌లో కూడా నిర్మించడానికి అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. రవాణా శాఖ సీజ్ చేసిన వాహనాలు బస్సు డిపోలో చాలా కాలంగా పేరుకుపోవడంతో సమయం తీసుకుని ఆక్షన్ వేయాలని సూచించారు. ఆర్టీసీలో ప్రమాదాలను తగ్గించడానికి తొలి దశలో లహరి, రాజధాని, గరుడ బస్సుల్లో అమలవుతున్న డ్రైవర్ మానిటరింగ్ సిస్టం పని తీరును అడిగి తెలుసుకున్నారు. దీని ద్వారా డ్రైవర్ నిద్ర ఉపక్రమించే సూచనలు కానీ, మొబైల్ వాడుతున్నప్పుడు మానిటరింగ్ చేస్తూ అప్రమత్తం చేస్తుంది. ఇక ఆర్టీసీ హైర్ బస్సు డ్రైవర్‌లకు నిరంతరం శిక్షణ ఇవ్వడమే కాకుండా.. ప్రతి బస్సుకి ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి నిర్ణయాన్ని కఠినతరం చేయాలని పేర్కొన్నారు.
