Rain Alert: తెలంగాణ ప్రజలకు అలెర్ట్.. మరో రెండు రోజులు భారీ వర్షాలు.. 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్!
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు..
తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా ఏకధాటిగా కురుస్తోన్న వర్షాలకు హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. దీంతో జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఇటు రోడ్ల మీద కూడా నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇదిలా ఉంటే.. రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అంతటా మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
అలాగే రాష్ట్రవ్యాప్తంగా కురుస్తోన్న భారీ వర్షాల నేపధ్యంలో వాతావరణ శాఖ 13 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి. అటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాది కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఎవ్వరూ కూడా బయటికి రావొద్దని.. ఈ మూడు రోజులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.
మరోవైపు కుంటాల జలపాతానికి వరద పోటెత్తింది. భారీ వరదతో ఉగ్రరూపం దాల్చింది. అయితే కుంటాల జలపాతాన్ని చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు పర్యాటకులు. వరద ఉధృతి ప్రమాదకరంగా మారడంతో అనుమతి లేదని కుంటాల మెయిన్ గేట్ వద్దే పర్యాటకులను ఆపేస్తున్నారు అధికారులు.