చల్లబడిదనుకున్న లగచర్ల ఇష్యూ మరోసారి వేడెక్కింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ తోపాటు అధికారులపై దాడి కేసులో నిందితుడు, రైతు హీర్యా నాయక్‌ను సంగారెడ్డి జైలు నుంచి సంకెళ్లతో హాస్పిటల్‌కు తరలించడం వివాదాస్పదంగా మారింది. దీనిపై విపక్ష పార్టీలు భగ్గుమంటున్నాయి. గుండెపోటు వస్తే కరుడుగట్టిన నేరస్తుడిని సైతం అంబులెన్స్‌లో తరలిస్తారని.. అలాంటిది అన్నదాతకు హార్ట్ ఎటాక్ వస్తే సంకెళ్లు వేసి పోలీస్ వాహనంలో తీసుకువెళ్తారా అని ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర గవర్నర్ కూడా ఈ అంశంపై విచారణకు ఆదేశించాలన్నారు.
అయితే.. రైతుకు బేడీలు వేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సీరియస్ గా తీసుకుంది.. జైలుల్లో ఉన్న రైతుల్లో ఈర్యా నాయక్‌కు గురువారం ఉదయం గుండెపోటు రావడంతో జైలు అధికారులు హీర్యా నాయక్‌కు బేడీలు వేసి ఆస్పత్రికి తరలించడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.. విచారణ నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందులో భాగంగా సంగారెడ్డి జైలు అధికారిగా ఉన్న సంజీవ రెడ్డిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఆదేశాలు జారీ చేశారు. సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌పై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది ప్రభుత్వం..
అయితే.. హీర్యానాయక్ బేడీల ఘటనపై సుమారు నాలుగు గంటల పాటు వికారాబాద్, సంగారెడ్డి జిల్లా ఎస్పీలతో కలిసి జైలు సిబ్బందిని ఐజీ సత్యనారాయణ విచారించారు. అయితే.. రైతుకు సంకెళ్ల కేసులో జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా మారింది. హీర్యానాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే.. ఆయనను బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టు రికార్డుల్లో చూపించారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్‌కుమార్ కేసును మార్చి పంపడం వెనక కుట్ర ఉందంటున్నారు ఆయన బంధువులు.
అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు..మాజీమంత్రి హరీష్‌రావు. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్యన్న హరీష్‌రావు.. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? అని ప్రశ్నించారు. రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అటు బీజేపీ సైతం పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడుతోంది. లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేయడంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
లగచర్ల రైతుకు సంకేళ్ల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తుంటే..ఇటు హస్తం పార్టీ నేతలు బీఆర్‌ఎస్ హయాంలోని నల్గొండ, ఖమ్మం జిల్లా రైతుల అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. 2017లో ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డుపై దాడి ఘటనలో 10 మంది రైతులను అరెస్ట్ చేశారు..పోలీసులు. అరెస్ట్ అయిన రైతులను న్యాయస్థానానికి సంకెళ్ళు వేసి తీసుకువచ్చారు. అన్నం పెట్టే రైతుల చేతులకు సంకెళ్లు వేయడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది. తాజా ఎపిసోడ్‌తో..ఖమ్మం వ్యవహారాన్ని ఇప్పుడు తెరమీదకు తెస్తున్నారు..కాంగ్రెస్ పార్టీ నేతలు.
అయితే రైతుల విషయంలో నాడు కేసీఆర్ నడిచిన బాటలోనే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా నడుస్తోందని కౌంటర్ ఇస్తోంది బీజేపీ. కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ ప్రభుత్వానికి కూడ పడుతోందని హెచ్చరిస్తోంది.
మొత్తానికి అప్పుడు ఖమ్మం ఇష్యూలో పోలీసుల తీరు నాటి కేసీఆర్ ప్రభుత్వానికి తలనొప్పులు తెస్తే.. ఇప్పుడు లగచర్ల ఘటనలో ఖాకీల అత్యుత్సాహం రేవంత్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..