తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పధకంలోకి చేర్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పధకాన్ని పరిమితం చేసింది. ఆ తర్వాత దశలవారీగా ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు.
కరోనాకు అందించే చికిత్సలను మొత్తం 17 రకాలుగా ప్రభుత్వం విభజించింది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్(ఏబీ) పదకంలోకి కరోనా చికిత్సను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పధకాన్ని అమలు చేస్తోంది. దీనితో ఆరోగ్యశ్రీలోకి కరోనా చేర్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనితో ఇకపై కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్‌తో కలిపి ఆరోగ్యశ్రీ పధకం అమలవుతుంది.
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకే ఈ పధకం పరిమితం చేయడంతో అర్హులైన కరోనా రోగులకు అయ్యే ఖర్చులను ప్రభుత్వం నేరుగా ఆయా సర్కార్ ఆసుపత్రులకు అందజేయనుంది. మరోవైపు ఆరోగ్య శ్రీ పధకం కింద రూ. 2 లక్షల వరకు కవరేజీ.. ఆయుష్మాన్ భారత్ కింద రూ. 5 లక్షల వరకు కవరేజీ ఉన్న సంగతి తెలిసిందే. వైరస్‌లతో వచ్చే అన్ని రకాల జ్వరాలకు.. అలాగే స్వైన్‌ఫ్లూ వైద్యాన్ని కూడా ఆరోగ్యశ్రీలోకి చేరుస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనాతో వచ్చే వివిధ రకాల వ్యాధులకు ప్యాకేజీల వారీ చికిత్సను అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్ కేటగిరీల్లో ప్యాకేజీల కింద వైద్య సేవలు అందుతాయి. కాగా, ఆరోగ్యశ్రీ పధకం కింద ఇప్పటివరకు 949 వ్యాధులకు చికిత్స అందుతుండగా.. తాజాగా ఆ జాబితాలోకి కరోనా సంబంధిత వ్యాధులు, స్వైన్ ఫ్లూను ప్రభుత్వం చేర్చింది. ఆరోగ్యశ్రీ పధకం కింద కరోనా చికిత్స పెద్దలతో పాటు పిల్లలకు కూడా అందనుంది.
Read Also: కివి పండ్లను వీరు అస్సలు తినకూడదు.. తింటే ఎలా పరిస్థితులు ఎదురవుతాయంటే..
ఈ ఫోటోలో సింహం ఎక్కడుందో కనిపెట్టండి.! కళ్లకు పని చెప్పండి.. గుర్తించండి!