AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో ‘పవర్‌’ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!

ఎన్నికలకు ముందు మన ప్రధాన పార్టీల మధ్య జరిగిన డైలాగ్ వార్. విద్యుత్ చుట్టూరే ఆరోపణలు, విమర్శలు, హామీలు గుమ్మరించాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. పవర్‌ సెక్టార్‌లో ఏదో జరుగుతోందన్నది కాంగ్రెస్‌ సర్కార్‌కు అనుమానం వచ్చింది. ఆ అనుమానాలను ఇంకా బలపరిచేలా..ఇద్దరు విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాజీనామా చేశారు.

Telangana: తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
Telangana Power Politics
Follow us
Ravi Kiran

| Edited By: Basha Shek

Updated on: Dec 08, 2023 | 10:00 PM

ఎన్నికలకు ముందు మన ప్రధాన పార్టీల మధ్య జరిగిన డైలాగ్ వార్. విద్యుత్ చుట్టూరే ఆరోపణలు, విమర్శలు, హామీలు గుమ్మరించాయి. ఇప్పుడు సీన్ కట్ చేస్తే.. పవర్‌ సెక్టార్‌లో ఏదో జరుగుతోందన్నది కాంగ్రెస్‌ సర్కార్‌కు అనుమానం వచ్చింది. ఆ అనుమానాలను ఇంకా బలపరిచేలా..ఇద్దరు విద్యుత్‌శాఖకు చెందిన ఉన్నతాధికారులు రాజీనామా చేశారు. మూడురోజుల కిందట టీఎస్‌జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు రాజీనామా చేశారు. గురువారం టీఎస్‌ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు కూడా తనపదవికి రాజీనామా చేస్తూ ఇంధనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపించారు.

ఇప్పుడీ సీనియర్ అధికారులిద్దరూ రిజైన్ చేయడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. రాజకీయంగా పెద్ద యుద్ధానికి తెరలేపింది. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ గత ప్రభుత్వం తాలూకూ తప్పులు ఇవన్నీ అని ఎత్తిచూపే ప్రయత్నం తొలిరోజు నుంచే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో తొలి సమీక్ష విద్యుత్ శాఖే. తనను ఫెయిల్యూర్ సీఎంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారా అంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే డౌట్ పడేస్థాయిలో విద్యుత్ సంక్షోభం రాష్ట్రంలో ఉందా.. అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నాయి.

తెలంగాణలో 24 గంటల కరెంట్ విషయంపై ఎన్నికల ముందు బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు మాటల యుద్ధం చేసుకున్నాయి. కాంగ్రెస్​ వస్తే చీకటి రాజ్యమే వస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కరెంట్​ కోతలు ఉంటాయంటూ బీఆర్​ఎస్​ ప్రచారం చేయగా.. అలాంటిదేమీ ఉండదంటూ కాంగ్రెస్​ కూడా ధీటుగా సమాధానం చెబుతూ వచ్చింది. దీంతో రెండు పార్టీల నడుమ ఇదే ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. ఎన్నికల ప్రక్రియ ముగిసి కాంగ్రెస్​ అధికారం దక్కించుకోగా.. సీఎం రేవంత్​ రెడ్డి నిర్వహించిన మొట్టమొదటి కేబినెట్ మీటింగ్​‌లో కీలకంగా విద్యుత్తు అంశం పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా విద్యుత్తు శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులపై సీరియస్​ అయ్యారు.

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సాక్షాత్తూ సీఎమే అనుమానపడేస్థితికొచ్చింది. విద్యుత్తు శాఖలో ఇప్పటివరకు 85 వేల కోట్ల అప్పులు ఉన్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. దీనిపై పూర్తిస్థాయి వివరణ కోసం 2014 నుంచి ఇప్పటివరకు శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో హాజరు కావాల్సిందిగా ఆఫీసర్లను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం పూలే ప్రజా భవన్‌లో నిర్వహించే ప్రజాదర్బార్ అనంతరం విద్యుత్తుశాఖ ఉన్నతాధికారులతో సీఎం ప్రత్యేకంగా రివ్యూ చేయాలని భావించినా కుదర్లేదు. ట్రాన్స్​ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్​ రావు ఇప్పటికే రాజీనామా చేయడంతో ఆయన రాజీనామాను ఆమోదించవద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బహుశా ఆ రివ్యూలో ఏ జరుగుతుందోననే ఉత్కంఠ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉంది.