దేశంలో ఎక్కడా లేని సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకొని… ధవళకాతుల ధగధగలతో మెరిసిపోతున్న తెలంగాణ సరికొత్త పాలనా సౌధం కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. సకల సదుపాయలతో, ఆధునిక హంగులతో నిర్మితమైన తెలంగాణ కొత్త సచివాలయం నేడు అందుబాటులోకి రానుంది. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు తమకు కేటాయించిన చాంబర్లలో ఆశీనులు కానున్నారు.
భిన్న సంస్కృతులను ప్రతిబింబించే నిర్మాణ శైలుల సమ్మేళనం.. సంప్రదాయ, ఆధునిక సౌందర్యాల కలబోత. కాకతీయ కళాఖండాలు, తెలంగాణ సంస్కృతి, జీవనస్థితులను అడుగడుగునా నింపుకుని.. దేదీప్యమానంగా ఆవిష్కృతమైందో.. అద్భుత కట్టడం. ఓవైపు హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం, మరోవైపు నిలువెత్తు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం, ఇంకోవైపు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిర్మిస్తున్న అమరజ్యోతి.. పక్కనే ఎన్టీఆర్ పార్క్, లుంబినీ పార్క్, ఆ పక్కన నెక్లెస్ రోడ్, ఐమాక్స్.. ఇలా చారిత్రక, పర్యాటక అంశాలతో ముడిపడిన ప్రదేశంలో నిర్మించిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఇవాళ మధ్యాహ్నం సచివాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించనున్న సుదర్శన యాగం కోసం సచివాలయ ప్రాంగణంలో యాగశాల చేశారు. ఆదివారం ఉదయం నుంచి సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం అయ్యింది. మధ్యాహ్నం 1.20 నుంచి 1.30 నిమిషాల మధ్య యాగం పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. ఆ తరువాత నూతన సమీకృత సచివాలయం రిబ్బన్ కటింగ్ చేసిన వెంటనే 6వ అంతస్తులోని తన ఛాంబర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కొలువుదీరనున్నారు. సచివాలాయాన్ని ప్రారంభించిన వెంటనే సీఎం కేసీఆర్ కార్యకలాపాలను ప్రారంభిస్తారు. సీఎం కేసీఆర్ తన కుర్చీలో కూర్చున్న తర్వాత… మంత్రులు తమ ఛాంబర్లకు వెళ్లి కుర్చీల్లో కూర్చొంటారు. మంత్రులు అందరూ కూడా తమ శాఖకు సంబంధించిన ఒక దస్త్రంపై… సంతకం చేస్తారు. మధ్యాహ్నం ఒంటి గంట 58 నిమిషాల నుంచి 2 గంటల 4 నిమిషాల వరకు.. అధికారులు కుర్చీల్లో కూర్చొని ఒక దస్త్రంపై సంతకాలు చేయడంతో ప్రారంభోత్సవ ఘట్టం పూర్తవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు కొత్త సచివాలయం ప్రాంగణంలో గ్యాదరింగ్ ఉంటుంది. సచివాలయ ఉద్యోగులు ఆహ్వానితులతో కూడిన సమావేశాన్ని ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.
మంత్రి కేటీఆర్ ఇవాళ సచివాలయంలో తనకు కేటాయించిన కార్యాలయంలోకి అడుగుపెట్టబోతున్నారు. నూతన సచివాలయంలో కేటీఆర్‌కు కేటాయించిన మూడో అంతస్తులో నుంచి విధులు నిర్వర్తించనున్నారు. కొత్త సచివాలయంలో విధులను ప్రారంభిస్తున్న సందర్భంగా మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లకు కేటాయింపునకు సంబంధించిన ఉత్తర్వుల పైలుపై తొలి సంతకం చేయనున్నారు.
సచివాలయం ప్రారంభోత్సం నేపథ్యంలో సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించారు. ఉదయం నుంచి రాత్రి వరకు.. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రకటించారు. సచివాలయ ప్రారంభోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని… లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, లేజర్ షోలను మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..