CM KCR హస్తినకు చేరుకున్న సీఎం కేసీఆర్.. ఆర్థిక రంగ నిపుణులు, పాత్రికేయులతో భేటీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. జాతీయ పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో....
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. జాతీయ పర్యటనలో భాగంగా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయల్దేరారు. ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆర్థిక రంగ నిపుణులు, ప్రముఖ పాత్రికేయులతో సీఎం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రూపకల్పన కోసం రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ నెల 22వ తేదీన మధ్యాహ్నం ఢిల్లీ(Delhi) నుంచి చండీగఢ్‌కు వెళ్తారు. జాతీయ రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తానన్న హామీ మేరకు సుమారు 600 కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించనున్నారు. ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు పంజాబ్(Punjab)లోనే ఉంటారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించి నేతలతో చర్చలు జరిపిన ఆయన తాజాగా విస్తృత స్థాయిలో ఢిల్లీ, పంజాబ్, హరియాణా, కర్ణాటక, మహారాష్ట్రలలో పర్యటించనున్నారు. సీఎం ఆదేశాల మేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి శుక్రవారం ఉదయమే దిల్లీ చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆనంద్‌లు ఢిల్లీకి వెళ్లారు.
ఢిల్లీలోని వసంత్ విహార్‌లో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులను శుక్రవారం ప్రారంభించారు. దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు ప్రాంభమయ్యాయని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర పక్షాలను ఒక్కతాటి మీదకి తెచ్చే సంకల్పాన్ని భుజానికెత్తుకున్న కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఆ పార్టీల వైఫల్యాలను ఎండగడుతున్నారు. రెండు పార్టీలు కలిసి సుదీర్ఘకాలం దేశాన్ని పరిపాలించినా ఇంకా ఎన్నో రంగాల్లో చేయాల్సిన దానిలో 10 శాతం కూడా చేయలేకపోయాయని కేసీఆర్ అంటున్నారు. అందుకు దేశంలో అందుబాటులో వున్న నీటి వనరులను, వాటిని వినియోగించుకుంటున్న పరిమాణాలను కేసీఆర్ కొన్ని మీడియా భేటీలలో ప్రస్తావించారు.
నదీజలాల లభ్యత ఎంతో వున్నా అందులో హెచ్చు శాతం సముద్రం పాలవుతోందని, అందుకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంతకాలం పరిపాలించిన కాంగ్రెస్, బీజేపీలే కారణమని ఆయనంటున్నారు. ప్రశాంత్ కిశోర్ వంటి రాజకీయ వ్యూహకర్తతో ఆయన వరుస భేటీలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో చురుకుగా మారేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నారు. ఆ తర్వాత మలిదశగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు కేసీఆర్. ఈ పర్యటనలో కేసీఆర్ ఎలాంటి సానుకూల ఫలితాలను సాధిస్తారో వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral video: నడిరోడ్డుపై ఓ అమ్మాయి పోల్ డ్యాన్స్.. నివ్వెరపోయిన జనం, రచ్చ రచ్చ చేశారు..!